కూసుమంచిలో జయభేరి 'మాయ'..!

by Dishanational1 |
కూసుమంచిలో జయభేరి మాయ..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: పంట పొలాలపై రియల్ రాబందులు కన్నేశాయి.. తక్కువ ధరకు రైతుల వద్దనుంచి భూములు కొంటూ ప్లాట్లుగా మార్చి కోట్లకు పడుగలెత్తుతున్నాయి. పచ్చని భూములు కొని సక్రమంగా రియల్ వ్యాపారం చేస్తున్నారా? అంటే అదీలేదు.. అన్నీ అక్రమ వెంచర్లే.. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు అక్రమార్కులు. అనుమతుల కోసం అప్లై చేసుకోవడం, అవి రాకముందే అన్నీ ఉన్నాయంటూ అమాయకులను మోసం చేయడం.. తెలిసీతెలియక కొన్నవారు ఇబ్బందుల్లో పడడం ఇదీ కొన్ని వెంచర్లలో జరుగుతున్న అక్రమ తంతు. ఇలాంటి మోసపూరిత వెంచర్లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నా రియల్ మాఫియా అధికారులను మచ్చిక చేసుకుని దందా నడిపిస్తుండడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ భారీ వెంచర్ ఇప్పుడు కూసుమంచిలో వెలుస్తోంది. శ్రీనిధి ఎన్ క్లేవ్ వారి జయభేరి గ్రీన్ సిటీ పేరుతో వెలుస్తున్న వెంచర్ కు ఇంతవరకు ఎలాంటి పర్మిషన్స్ లేవు.. కానీ అన్నీ ఉన్నట్లు అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధం అవుతున్నారు.

100 ఎకరాల్లో భారీ వెంచర్..

కూసుమంచి మండల కేంద్రంలో సుమారు 100 ఎకరాల్లో భారీ వెంచర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి గానీ.. ప్రభుత్వ అనుమతులు గానీ లేకపోవడం గమనార్హం. అయితే వీరు మాత్రం తమ బ్రోచరల్లో డీటీసీపీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), రెరా( రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) అప్రూవుడ్ లేఅవుట్ అంటూ ఊదరగొట్టి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతుల వద్దనుంచి భూమలు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేయిస్తున్నారు. వాస్తవానికి పంటపొలాలను ప్లాట్లు మార్చేందుకు నాలా కన్వర్షన్ తీసుకుని.. ఆ తర్వాత డీటీసీపీతో పాటు సంబంధిత అనుమతులు పొందాలి.. కానీ ఈ వెంచర్ నిర్వాహకులు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులకు కూడా వెళ్లనట్లు తెలుస్తోంది. అయినా పంటపొలాలను నాశనం చేస్తూ భూమి చదును చేస్తున్నారు.


అప్పుడే విక్రయాలు..

కూసుమంచిలో ఏర్పాటవుతున్న జయభేరి వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా అప్పుడే కస్టమర్లకు ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి చదును చేసే పనులు జరుగుతుండగానే కస్టమర్లకు స్థలాన్ని చూపించడం.. వారికి మాయమాటలు చెప్పి అడ్వాన్సులు కట్టించుకునే పనిలో వెంచర్ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. అడ్వాన్స్ బుకింగులంటూ.. ఆలస్యం చేస్తే ప్లాట్లు దొరకవంటూ ఏజెంట్ల ద్వారా నమ్మబలుకుతూ.. ప్లాట్ కావాలంటే టోకెన్లు ఇప్పటినుంచే తీసుకోవాలని కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా సమాచారం. ఇంకా అనుమతులే తీసుకోలేదు.. ప్లాటింగ్ పూర్తి కానేలేదు కానీ అప్పడే ఈ వెంచర్ లో రేట్లు కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందు భాగంలో గజం ధర రూ.7500, వెనుకభాగంలో రూ.6500గా నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఇలానే కొన్ని వెంచర్లు ఏర్పాటు చేసి అడ్వాన్సుల రూపంలో లక్షలు తీసుకొని మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని వెంచర్లలో చూపించిన ప్లాటు ఒకటైతే.. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు వేరుగా ఉన్న ఘటనలు కోకొల్లలు ఉన్నాయి.

అనుమతులే లేవన్న అధికారులు..

వాస్తవానికి ఈ భారీ వెంచర్ కు సంబంధించి ఇంతవరకు ఏ ఒక్క అనుమతి లేదు.. అయితే నిర్వాహకులు బ్రోచర్లలో మాత్రం డీటీసీపీ, రెరా అప్రూవుడ్ అంటూ ముద్రించి జనాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్లాట్లు చదును కాకముందే విక్రయాలు మొదలు పెట్టారు. సోషల్ మీడియా గ్రూపుల్లో జయభేరి వెంచర్ కు సంబంధించిన రంగురంగుల బ్రోచర్లు తిప్పుతున్నారు.. ఇదే విషయమైన దిశ ప్రతినిధి అధికారులను సంప్రదించగా.. ఇంత వరకు తమ వద్దకు జయభేరికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అనుమతులు లేనిదే ఎలాంటి పనులు స్టార్ట్ చేయడం, విక్రయాలు జరపడం, లేనివి ఉన్నట్లు చూపడం నిబంధనలకు విరుద్ధమే అన్నారు.

అధికారుల చర్యలేవి..?

కూసుమంచిలో ఎలాంటి అనుమతులు లేకున్నా 100 ఎకరాల్లో వెంచర్ పేరిట పంటపొలాలను ధ్వంసం చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు లేని అనుమతులను చూపిస్తూ అమాయకులను ముంచే ప్రయత్నం చేస్తున్నారని.. అసలు ప్లాటింగే కానిది విక్రయాలు జరుపుతున్నా, అడ్వాన్సుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నా నోరుమెదపకోవడంతో విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ఇలాంటి మోసపూరిత వెంచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొందరు ఏజెంట్లు మాత్రం ఇప్పటికే కస్టమర్లను వాహనాల్లో తీసుకెళ్లి ప్లాట్లను చూపిస్తున్నారు. ఇష్టమై కొనుగోలుకు సిద్ధపడ్డవారి నుంచి టోకెన్ అమౌంట్ వసూలు చేస్తున్నారు.


Next Story

Most Viewed