జూలూరుపాడు మార్కెట్ యార్డులో భారీ మోసం

by Disha Web |
జూలూరుపాడు మార్కెట్ యార్డులో భారీ మోసం
X

దిశ, జూలూరుపాడు: పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్ కు వచ్చిన రైతు వ్యాపారుల మాయాజాలంతో నిలువ దోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం శ్రమించినా చివరకు గిట్టుబాటు ధర దక్కక నష్టాల పాలవుతున్నాడు. మార్కెట్లో చేతికొచ్చిన పంటను ఇద్దామంటే దళారుల దోపిడీకి గురవుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే తెల్ల బంగారం క్రయవిక్రయాలకు జూలూరుపాడు మార్కెట్ యార్డు పెట్టింది పేరు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ యార్డులో పత్తి రైతు దగా పడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రతిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు వేలాది క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఇదే అదనగా భావించిన వ్యాపారులు పత్తి కొనుగోళ్లలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పత్తిని కొనుగోలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారు.తూకలలో మోసం... ధరల్లో వ్యత్యాసం

రైతులు మార్కెట్ కు తెచ్చిన పత్తిని వే బ్రిడ్జిపై తూకం వేస్తున్నారు. ఈ క్రమంలో తూకంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాపకొల్లుకు చెందిన ఓ రైతు పత్తిని తీసుకురాగా వే బ్రిడ్జి పై కాంట వేయడంతో 18 క్వింటాళ్లు రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు మాత్రమే వచ్చినట్లు వ్యాపారులు చూపడంతో రైతు ఆశ్చర్యపోయాడు. వెంటనే బ్రిడ్జి నిర్వాహకుడిని, వ్యాపారులను సదరు రైతు నిలదీశాడు. ఈ విషయమై వివాదం తలెత్తడంతో రైతుతో వ్యాపారులు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం మార్కెట్ యార్డులో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా ధర విషయములోనూ అతిగా రైతులు దగా పడుతున్నారు. వ్యాపారులు జెండా పాట పేరుతో తొలుత అధిక ధర హెచ్చించి రెండు మూడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరను నమ్మిన రైతులు అధిక మొత్తంలో పత్తిని మార్కెట్ కు తీసుకొస్తున్నారు. జెండా పాట అనంతరం రైతులను బురిడీ కొట్టించి నాణ్యత లేదని సాకుతో తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసులకు ఓర్చి పత్తిని తీసుకొచ్చిన రైతులు మరోచోటికి తీసుకువెళ్లలేక వ్యాపారులు అడిగిన ధరకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.

కొరవడిన పర్యవేక్షణ

మార్కెట్ యార్డులో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నామమాత్రంగా తూనికలు - కొలతల శాఖ అధికారి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు. మార్కెట్ కు నిత్యం వేలాది క్వింటాళ్లు పత్తి వస్తున్నా మార్కెట్ వర్గాలు చూపే లెక్కలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ శాతం పత్తిని అనధికారికంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జూలూరుపాడు మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందుకుగాను నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed