గంటసేపైనా రాని 108 వాహనం... చివరకు ట్రాలీ ఆటోలో క్షతగాత్రుడి తరలింపు

by Disha Web |
గంటసేపైనా రాని 108 వాహనం... చివరకు ట్రాలీ ఆటోలో క్షతగాత్రుడి తరలింపు
X

దిశ, వైరా: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకున్ని తీసుకువెళ్లేందుకు 108 వాహనం రాకపోవడంతో ట్రాలీ ఆటోలో క్షతగాత్రుడిని తరలించిన అమానుష ఘటన మంగళవారం రాత్రి వైరాలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని తీసుకెళ్లేందుకు 108 వాహనం గంటసేపైనా రాలేదు. దీంతో ఆ క్షతగాత్రుడి స్నేహితులు చివరకు ట్రాలీ ఆటోలో విషమ పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. వైరాలోని తల్లాడ రోడ్ లో ఎస్ఎస్ఎల్ రెస్టారెంట్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమాన్ బజారు చెందిన పిల్లలమర్రి గోపి తీవ్రంగా గాయపడ్డాడు. వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ వెనుక టైర్ పంచర్ కావడంతో తల్లాడ రోడ్లోని ఎస్ఎస్ఎల్ రెస్టారెంట్ పక్కనే ఉన్న పంచర్ షాప్ వద్ద రోడ్డుపై ఆ లారీని నిలిపివేశారు. అయితే అదే సమయంలో వైరా నుంచి తల్లాడవైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గోపి ఆగి ఉన్న లారీని వెనుకవైపు వేగంగా ఢీ కొట్టాడు. దీంతో గోపికు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో గోపి విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు 108కు సమాచారం అందించారు. గంటసేపైనప్పటికీ 108 వాహనం రాకపోవడంతో గోపి స్నేహితులు అతనిని ట్రాలీ ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైరా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. 108 నిర్లక్ష్యం వల్ల విషమ పరిస్థితిలో ఉన్న గోపీని రోడ్డుపైన గంటసేపు రక్తపు మడుగులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. వైరా పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story