సీతారాంపురం సర్పంచ్ సస్పెన్షన్​

by Disha Web Desk 15 |
సీతారాంపురం సర్పంచ్ సస్పెన్షన్​
X

దిశ, ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సున్నం సుశీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సీతారాంపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్న సుశీల అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత శాఖ పంచాయతీ రాజ్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు సుశీల బదులిచ్చారు. సంతృప్తి చెందని జిల్లా కలెక్టర్ సున్నం సుశీల ను పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(1) ప్రకారం సర్పంచ్ పదవినుంచి తొలగించారు. అదే క్రమంలో పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 141 ప్రకారం ఆమె 30 రోజుల్లో పంచాయతీ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లోపేర్కొన్నారు.

సుశీల మీద ఉన్న ఆరోపణలు

ఇదే పంచాయతీ లోని షేక్ రఫీ అహ్మద్, షఫీ అహ్మద్, జీబీ అహ్మద్లకు చెందిన సర్వేనంబర్ 170, 171, 172 లోని 6.7 ఎకరాల భూమిని తన బంధువుల తో కలిసి దౌర్జన్యం గా ఆక్రమించి, ఆ భూమిలో ఉన్న పంటను ధ్వంసం చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే భూదందా విషయమై 2022 సంవత్సరంలో ఆమెతో పాటు ఆమె బంధువులపై వరుసగా ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో పోలీసు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆమెపై పెట్టిన కేసుల ప్రాథమిక విచారణ రిపోర్ట్ కాపీలను సైతం కలెక్టర్ తెప్పించుకుని పరిశీలించారు.

గతంలోనూ సుశీల సస్పెండ్

నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సున్నం సుశీల గతంలో ఆరు నెలలు సస్పెండ్ అయ్యారు. ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకునేది కాదని, ఆమె వెంట ఉన్న కొందరు గిరుజనేతరులు ఆమెను నడిపించేవారన్న ఆరోపణలు ఉన్నాయి.


Next Story