పోలీస్ స్టేషన్ సాక్షిగా అంబేద్కర్‌కు అవమానం

by Disha Web Desk 12 |
పోలీస్ స్టేషన్ సాక్షిగా అంబేద్కర్‌కు అవమానం
X

దిశ, కూసుమంచి: భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రతిపత్తిని అందించింది మన రాజ్యాంగం వివిధ కులాల మతాల సంస్కృతులు ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగ ఫలమే, కానీ దానిని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోలీస్ స్టేషన్ అధికారుల సాక్షిగా అవమాన పడుతున్నారు. నాడు విగ్రహాన్ని తొలగింపులో మాటిచ్చిన అధికారులు నేడు పట్టించుకునే వారు లేక పోలీస్ స్టేషన్ లోనే దిగాలుగా నిరీక్షిస్తున్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో 1988వ సంవత్సరంలో అవేర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పికేఎస్ మాధవన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

గత మూడేండ్ల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా ఆర్ అండ్ బి అధికారులు తొలగించేందుకు యత్నించగా ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు నాయకులు తొలగించవద్దని ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో అప్పటి ఆర్ అండ్ బీ అధికారులు , ఎస్సై, సీఐ అధికారులతో చర్చలు జరిపారు. రోడ్డు వెడల్పు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేడు అధికారులు ,పట్టించుకునే నాథుడే లేడని వివిధ దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవమాన పడుతున్న అంబేద్కర్

ఒక్క భారత దేశానికే కాకుండా నిలుస్తున్న రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పోలీసు స్టేషన్ లో ఓ మూలన నిరీక్షిస్తూ ఉండి అవమాన పడుతున్నారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని రాజకీయ రంగును పులుముతూ,అవసరాలకు వాడుకుంటుండటం తప్ప పట్టించుకోవడం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగింపు సమయంలో అధికారులు ఇచ్చిన మాట నీటి మూటలానే మిగిలిపోతుంది. హామీ అమలను పట్టించుకునేవారు లేక విగ్రహం పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోయింది. రాజ్యాంగ నిర్మాత విగ్రహంతో మాకు ఎందుకు అని ఎవరికి వారు మిన్నకుండిపోతున్నారు. మూడు సంవత్సరాల కాలంగా అంబేద్కర్ గుర్తుకు రాకపోవడం పలువురిని ఆవేదనకు గురిచేస్తుంది. రాజ్యాంగ నిర్మాతపై ఏంటి ఈ నిర్లక్ష్యం అని మండిపడుతున్నారు.

గత నాలుగున్నరేళ్లుగా జయంతులు, వర్ధంతులు పోలీస్ స్టేషన్ లోనే

రోడ్డు వెడల్పు లో భాగంగా తొలగించిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మాట ఇచ్చిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజా సంఘాల నాయకులు, దళిత నాయకులు ప్రజలు పోలీస్ స్టేషన్లోనే అంబేద్కర్ వర్ధంతులు జయంతులు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలీస్ స్టేషన్ లోనే జరుపుకోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా?

అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన సంగతి కానీ ,నాలుగున్నర సంవత్సరాలు అవుతుందన్న విషయం ఇప్పుడు ఉన్న అధికారులకు తెలియదా? విగ్రహం ఎక్కడ ఉందన్న విషయం కూడా వారికి తెలియదేమో.. నాలుగున్నర సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం అధికారులకు గుర్తుకు రాకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు విషయం తెలుసుకొని రాజ్యాంగ నిర్మాతకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి విగ్రహం ఏర్పాటు చేపిస్తారో లేదో వేచి చూడాలి.



Next Story

Most Viewed