ఆ పాఠశాలతో విద్యార్థులకు ముప్పు.. వాళ్లంటే అధికారులకూ భయమే..?

by Disha Web Desk |
ఆ పాఠశాలతో విద్యార్థులకు ముప్పు.. వాళ్లంటే అధికారులకూ భయమే..?
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి శ్రీవివేకవర్ధని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ముర్రేడు వాగుకు అతి సమీపంలో నిర్మించిన ఈ పాఠశాల గతంలో ఆ వాగు ఉధృతికి నేలకూలింది. ఆసమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో స్కూల్ యాజమాన్యం ముర్రేడు వాగు ఉధృతిని సవాల్ చేస్తూ ప్రవహిస్తున్న వాగుపై మట్టిపోసి దానిపై గోడలు నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతి పెరుగుతూ స్కూల్ భవనాన్ని కోతకు గురి చేస్తుంది. పెను ప్రమాదం కళ్లముందే కనబడుతున్నా స్కూల్ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదంతో ఆటలాడుతూ మట్టితో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యార్థుల భద్రత గాలికి..

శ్రీవివేకవర్ధిని పాఠశాల విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసిందని పట్టణంలో చర్చ సాగుతోంది. కనీస వసతులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా భరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ముర్రేడు వాగు ఉధృతికి స్కూల్ భవనం ఏక్షణాన కులుతుందో అన్న భయం విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతున్నది. విద్యార్థుల కనీస భద్రతను మరిచి స్కూల్ నిర్వహిస్తున్నారని, ఏ క్షణాన ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారని తెలుస్తోంది.


చర్యలకు వెనకడుగు?

గతంలో ముర్రేడు వాగు ఉధృతికి నేలమట్టమైన పాఠశాల గోడలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా స్కూల్ యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా అధికారులకు పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా చర్యలకు వెనకాడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండల ప్రజలు వాగు రూపంలో స్కూల్ భవనానికి ప్రమాదం పొంచి ఉందని జిల్లా విద్యశాఖ అధికారులకు అనేక ఫిర్యాదులు సైతం అందినట్లు తెలుస్తోంది. తక్షణమే ఆ పాఠశాలను మూసివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, డిమాండ్ చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి

ముర్రేడు ఉధృతికి గతంలోనే ఆభవన గోడలు కూలిపోయాయి. తాత్కాలికంగా మట్టిపోసి వాటిపై గోడలు నిర్మించారు. వాగుప్రవాహం ఎక్కువైతే స్కూల్ భవనం కోతకు గురై నేలమట్టం అయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, తక్షణమే పాఠశాలను మూసివేయాలి.

- సత్యనారాయణ, వైఎస్సార్‌టీపీNext Story