అశ్వారావుపేటలో రికార్డు స్థాయి వర్షపాతం

by Disha Web Desk 12 |
అశ్వారావుపేటలో రికార్డు స్థాయి వర్షపాతం
X

దిశ, అశ్వారావుపేట: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమై.. రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అశ్వారావుపేట 324 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ లైన్లు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంటి పైకప్పులు ధ్వంసమై నేలకూలాయి. అశ్వారావుపేట మండల కేంద్రంలో మునుపెన్నడూ లేని విధంగా గౌడ, మంగలి బజార్ లు వరద నీటితో నిండిపోయాయి. ఖమ్మం రాజమండ్రి ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

నారంవారి గూడెం గుర్రాల చెరువు రోడ్డు కోతకు గురైంది. గుమ్మడవల్లి పెదవాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో మూడో నెంబర్ గేటు ఎత్తి 4028 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాగొడ్డుగూడెం, అచ్యుతాపురం వద్ద రోడ్లపై నుంచి ఐదు అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నడంతో అటుగా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షం ఈదురు గాలులు వేరుశనగ, పొగాకు, వరి, మొక్కజొన్న, కాకర రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందించాలని రైతులు ప్రాధేయ పడుతున్నారు.Next Story

Most Viewed