జర్నలిస్టుల గొంతుకనై ప్రశ్నిస్తా : మంద కృష్ణమాదిగ

by Disha Web Desk 15 |
జర్నలిస్టుల గొంతుకనై ప్రశ్నిస్తా :  మంద కృష్ణమాదిగ
X

దిశ, ఖమ్మం : తెలంగాణ ఉద్యమంలో అత్యంత త్యాగపూరితమైన పాత్రను పోషించిన పాత్రికేయుల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సమస్యలపై తాను జర్నలిస్టుల గొంతుకనై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టు సమాజం కోసం మిగిలిన సమాజమంతా గొంతు కలిపేలా అందరినీ కదిలిస్తానని పేర్కొన్నారు. ఇందుకోసం మొదటగా రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ మీట్ లు , రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను , సంఘాలను కలుపుకొని నేరుగా ముఖ్యమంత్రినే నిలదీస్తామని ఆయన అన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ తదితర పథకాలు దేశానికే ఆదర్శమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం అమలు జరుపుతున్న పథకాలు కూడా చెప్పుకునే స్థాయిలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమంలో మాత్రం దక్షిణాదిలోని మెజారిటీ రాష్ట్రాలు ముందున్నాయని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఒరిస్సా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో లాఠీ దెబ్బలు తగులుతున్నా, కెమెరాలు పగిలిపోతున్నా, యాజమాన్యాలు ఒత్తిళ్లకు గురిచేసినా వెనకడుగు వేయకుండా తెలంగాణ వీరోచిత పోరాటంలో త్యాగాల పాత్ర పోషించారని కొనియాడారు. వీరికి కనీసం ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీలను జనవరి 2023 కు ముందు కేసీఆర్ అమలు చేయాలని ,లేని పక్షంలో జర్నలిస్టుల పక్షాన తాము పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. రైతు బంధు పథకం భూస్వాములు, పారిశ్రామికవేత్తలు బడా వ్యాపారులకు ఇస్తుండగా కొద్దిమంది జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తే నష్టమేమీ లేదని పేర్కొన్నారు . వచ్చే ఫిబ్రవరి 23న మహాజన జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర మహాసభ హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, జర్నలిస్టు సంఘ నాయకులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, అమరవరపు కోటేశ్వరరావు , కనుకు వెంకటేశ్వర్లు, టి.దేవా పాల్గొన్నారు. కాగా టీయూడబ్ల్యూ జే ఐ జేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా ఐజేయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు నరుని వెంకట్రావు, నగర అధ్యక్షులు మైస పాపారావు, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ తదితరులు మందకృష్ణను కలిశారు.



Next Story