పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ అనుదీప్

by Disha Web Desk 15 |
పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ అనుదీప్
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలలో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శనివారం ఐడీఓసీ సమావేశపు హాలులో పోషన్ పక్వాడా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషన్ పక్వాడా కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమం నిర్వహణ లక్ష్యం ప్రధానంగా బలహీనంగా, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలను గుర్తించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. ఈ వర్గాల వారి ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని చెప్పారు. పోషణ లోపం నివారణలో భాగంగా ఏ గ్రామంలోనూ ఉండకుండా చేయాలనే ప్రధాన భావనతో విజయవంతం చేసి పరిపూర్ణ ఆరోగ్య వంతులను తయారు చేయాలని చెప్పారు.

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమాధికారి లేనీనా, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, డీపీఆర్ శ్రీనివాస్, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed