BRS నేతల మధ్య వర్గ విభేదాలు.. పొంగులేటి ఫ్లెక్సీల తొలగింపుతో మళ్లీ లొల్లి!

by Hajipasha |   ( Updated:2022-12-30 04:00:47.0  )
BRS నేతల మధ్య వర్గ విభేదాలు.. పొంగులేటి ఫ్లెక్సీల తొలగింపుతో మళ్లీ లొల్లి!
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం అధికార పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కొంత కాలంగా అధిష్టానం ఆయన్ను దూరం పెట్టిందనే ప్రచారం సాగుతోంది. పార్టీ పెద్దలు పొంగులేటికి అన్యాయం చేశారని, ఎలాంటి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తమ నాయకుడిని జనాలకు దూరం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది సొంత పార్టీ నేతలు పొంగులేటిపై ఎదురు దాడి చేయడమే కాకుండా.. వీలు దొరికినప్పుడల్లా కొంతమంది నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బుధవారం పొంగులేటికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా.. హోర్డింగులు పెట్టే ఇనుప స్టాండ్‌ను సైతం లేకుండా చేశారు. ఇది సొంత పార్టీలోని గిట్టనివారి పనేనని శ్రీనివాసరెడ్డి అనుచరులు అంటున్నారు.

రఘునాథపాలెం మండలం శివాయిగూడెం పువ్వాడ ఉదయ్ నగర్ రోడ్డులో 5 సంవత్సరాల క్రితం కిమ్స్ హాస్పిటల్‌కు సంబంధించిన హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది పొంగులేటి అభిమానులు ఆ హోర్డింగులకు శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను కూడా అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఫ్లెక్సీలు, హోర్డింగులతో పాటు ఏకంగా కాంక్రీట్‌తో ఏర్పాటు చేసిన ఇనుప స్టాండ్లను సైతం డోజర్ పెట్టి తొలగించారు. అంతేకాదు.. ఆ ఐరన్ పోల్స్ సైతం అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పొంగులేటి అభిమానులు, అనుచరులతో పాటు క్యాంపు ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలు సరికావని చెప్పుకొచ్చారు. ఇది సొంతపార్టీ నేతల పనే అని.. తమ నేతంటే పడనివారే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు తాము పాల్పడితే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని, ఇలాంటి పనులు చేయడం సబబు కాదని అంటున్నారు.

గతంలో పుట్టిన రోజు ఫ్లెక్సీలను సైతం..

పొంగులేటితో పార్టీలోని కొంతమంది నేతలకు పడకపోవడంతో గతంలో ఖమ్మంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించిన ఘటనలు జరిగాయి. అప్పుడు సైతం ఓ ముఖ్య నేత తమ నేత ఫ్లెక్సీలను తొలగించారని.. తాము సైతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని పొంగులేటి అనుచరులు, అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయని పార్టీ శ్రేణులే చెప్పుకొస్తున్నారు.

పొంగులేటిపై సొంత నేతలే..

శ్రీనివాస్ రెడ్డికి పార్టీ అధిష్టానం పలు సందర్భాల్లో ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా అన్యాయం చేసిందని అభిమానులు గుర్రుగా ఉన్నారు. తమ నేత ఎదుగుదలను తట్టుకోలేని నాయకులే దీనంతటికీ కారణమని ఆరోపిస్తున్నారు. అయితే పార్టీలోని ఓ వర్గం నేతలు వీలు దొరికినప్పుడల్లా పొంగులేటిపై, ఆయన అనుచరులపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. అడపా దడపా ఇలాంటి చర్యలకు సైతం పాల్పడుతున్నారు. కారు పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ను మిగతా వర్గం వారు.. టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్నారని, ఆధిపత్యం కోసం అవమానాలకు గురిచేస్తున్నారంటూ పొంగులేటి అనుచరులు అంటున్నారు.

ఇలాంటి చర్యలు సరికావు..

పొంగులేటి ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని ఏకంగా ఇనుప స్తంభాలను కూడా తొలగించారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలాంటి చర్యలు చేయడం సరికావు.. మేం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే పరిస్థితి ఏంటి..? అందుకే ఇలాంటి చర్యలను మానుకోండని తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు.



Next Story