కాంగ్రెస్‌లో పొంగులేటి బ్రాండ్

by Mahesh |
కాంగ్రెస్‌లో పొంగులేటి బ్రాండ్
X

దిశ బ్యూరో, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనో బ్రాండ్ అంబాసిడర్.. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ చరిష్మా ఉన్న నేత.. గతంలో అధికార పార్టీలోనే ఉండి ఏకంగా ప్రభుత్వ పెద్దలపైనే వాగ్బాణాలు సంధించి రాష్ట్ర రాజకీయాల్లో చాలాకాలం నానుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపించడమే కాకుండా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్‌కు చెందిన ఒక్కరినీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ సంచలన సవాల్ విసరడంతో ఆయన ప్రాభవం అమాంతం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో చేరిన వెంటనే ప్రచార కమిటీ కో-చైర్మన్ పదవి చేపట్టగా.. తాజాగా విజయభేరీ సభను కూడా ముందుండి నడిపించారు. 17న అత్యంత ప్రతిష్టాత్మకంగా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభ సక్సెస్ చేసే బాధ్యతల్లో పొంగులేటి కీ రోల్ పోషించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన ముఖ్య అనుచరుల్ని, అభిమానుల్ని రంగంలోకి దింపి సభకు భారీగా జనాన్ని తరలించారు.

వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం..

వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం.. అన్ని పార్టీలూ గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ‘సెప్టెంబర్ 17’ను అన్ని పార్టీలు వినియోగించుకునేందుకు సభలు నిర్వహించాయి. బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు హస్తం పార్టీల అగ్రనేతలు సైతం సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తుక్కుగూడలో విజయభేరికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సభను సక్సెస్ చేసేందుకు పొంగులేటిని ముందుంచడం.. ఆయన ఇమేజ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో పొంగులేటి సైతం సభ సక్సెస్ చేసి ప్రత్యర్థి పార్టీలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని ఇతర పార్టీల నాయకులే కితాబు ఇవ్వడం విశేషం.

చేరిన కొద్ది కాలంలోనే..

కాంగ్రెస్ పార్టీ.. వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీలో చేరిన కొద్దికాలంలోనే కీలక పదవులు కట్టబెట్టింది. ప్రచార కమిటీ కో-చైర్మన్‌గా, విజయభేరీ సభకు పబ్లిసిటీ బ్రాండింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు పార్టీలో స్థానాన్ని మరింత పెంచినట్లయింది. పార్టీలో చాలా మంది ముఖ్యులు ఉన్నప్పటికీ పొంగులేటికి కీలక పదవి అప్పగించడంపై ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ నేత ఏ కార్యం మొదలు పెట్టినా వెన్నంటి ఉండి సక్సెస్ చేశామని, భవిష్యత్‌లో సైతం ఆయన వెంటే ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృష్టి చేస్తామంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పొంగులేటి ఎఫెక్ట్..

పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌కు పెద్ద మైనస్.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవంగా పొంగులేటికి ఉమ్మడి జిల్లాలోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం అందించే ఆప్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బయటకు కన్పించకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఆయనకు మద్దతిచ్చి సహాయం చేసేవారు అన్ని జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బీఆర్ఎస్ అసంతృప్తులు సైతం పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చాలామందే ఆయన బాట పట్టారు. మొత్తంగా పొంగులేటి చేరిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం అవ్వడం.. అసంతృప్తులు ఏకమవడంతో అధికార పార్టీకి మింగుడు పడని విషయంగా చెబుతున్నారు.

సభ తర్వాత..

సభ తర్వాత పొంగులేటి అండ్ టీం మరింత దూకుడు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించగా.. వాటిని అమలు చేసేందుకు సిద్ధం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ఎఫెక్ట్ పడనున్నట్లు ఇప్పటికే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు పొంగులేటి ప్రత్యేక వ్యూహరచన చేశారని.. వచ్చే రోజుల్లో వాటిని అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed