ఆలస్యం... అమృతమా ..? విషమా..?

by Disha Web Desk 12 |
ఆలస్యం... అమృతమా ..? విషమా..?
X

దిశ, భద్రాచలం : బీఆర్ఎస్‌తో కయ్యానికి సిద్ధమైన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది క్లారిటీ లేదు. బిజెపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌టిపి పార్టీలు ఆయన ముందు కనిపిస్తున్న ఆప్షన్స్. అయితే చేరేది ఏ పార్టీ అనేది చెప్పకపోయినా తన అనుచరులు, అభిమానులు తన వెంటే నడుస్తారనే నమ్మకంతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికార పార్టీ నేతలపైన, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన విమర్శల బాణాలు సంధిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై ఎందుకు జాప్యం చేస్తున్నారో రాజకీయ పరిశీలకులకే కాదు, అభిమానులకు కూడా అంతుచిక్కడం లేదు. పెద్దలు ఆలస్యం.. అమృతం.. విషం అన్నారు. మరి పొంగులేటి చేస్తున్న ఆలస్యం రాజకీయంగా ఆయనకు అమృతం అవుతుందా లేక విషంగా (ప్రతికూలంగా) మారుతుందా అనేది ఇపుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.

ఒంటరి పోరాటం చేస్తున్న 'పొంగులేటి'

బిఆర్ఎస్‌ని వీడటానికి సిద్ధమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత లేకపోవడంతో ఎవరూ ఆయనకు సపోర్టుగాలేరు. తమ పార్టీలోకి వస్తారనే గంపెడు ఆశతో బిజెపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌టిపి పార్టీలు వేచిచూస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళన సభ వేదికలపై ఆయన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ సహా జిల్లా బిఆర్ఎస్ నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించిన ఆయన తన తీరుమార్చి వైరా సభ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

పొంగులేటి వేదికలపై చేస్తున్న విమర్శలకు బిఆర్ఎస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రతివిమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడిగా మాటల దాడి చేస్తుంటే పొంగులేటి మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. అదే ఆయన రాజకీయ నిర్ణయం తీసుకొని ఉంటే కనీసం తను చేరబోయే పార్టీ వాళ్ళు అయినా బిఆర్ఎస్ లీడర్లకు కౌంటర్ అటాక్ ఇచ్చేవారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జాప్యం వలన జారిపోతున్న కేడర్

పొంగులేటి పొలిటికల్ డెసిషన్ లేట్ అవడం వలన ఆయన వెంట నడిచిన వారు మెల్లగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ఆ పరిస్థతి కనిపిస్తోంది. పొంగులేటి తమ నాయకుడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం.‌ ఒకవేళ ఆయన వెంట ఉన్నందుకు బీఆర్ఎస్ నాయకత్వం తమపై వేటువేసినా తగ్గేదిలేదని పొంగులేటి ప్రోగ్రామ్‌ని చర్ల మండలంలో భుజాన వేసుకుని సక్సెస్ చేసిన నాయకులంతా ఇపుడు ఆయన వెంట నడవడానికి వెనుకంజ వేస్తున్నారు‌‌.

బిఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నా, ఫలానా పార్టీలో చేరుదామని కనీసం అనుచరులు, అభిమానులకు కూడా చెప్పకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండటం వలన పొంగులేటి వైఖరిపై అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ మార్పు విషయమై ఇంకా ఆయనకే ఓ క్లారిటీ‌ లేదు. అలాంటపుడు ఆయన తీసుకునే నిర్ణయం బెడిసికొడితే మండల స్థాయిలో నష్టపోతామేమో అనే భయంతో తమ డెసిషన్ మార్చుకొని యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్‌ పార్టీలో‌‌ 'రేగా' నాయకత్వంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు నిన్నమొన్నటి వరకు పొంగులేటి ఫాలోవర్‌గా చెప్పుకున్న చర్ల మండల బీఆర్ఎస్ నాయకుడు ఒకరు "దిశ" కి తెలిపారు.

ఇదిలా ఉండగా పొంగులేటి నిర్ణయం జాప్యం అవడం కూడా బీఆర్ఎస్‌కి కొంత కలిసివస్తోంది. ఆయన వెంట నడిచే వారిని కట్టడి చేసి వెనక్కి రప్పించే అవకాశం కలుగుతుంది రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. పార్టీ మారాలి అనుకున్నప్పుడు అనేక రకాల అంచనాలతో ఆచితూచి అడుగులు వేయడం మంచిదే అని, అలాగని తీవ్ర జాప్యం కూడా మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పొంగులేటి నిర్ణయం జాప్యం అవడం వలన మేలు చేస్తుందా లేక నష్టం కలిగిస్తుందా అనేది పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed