పెట్రోల్ కల్తీ.. ఫీలింగ్ స్టేషన్ యజమానులు నిలదీసిన వినియోగదారులు

by Disha Web |
పెట్రోల్ కల్తీ.. ఫీలింగ్ స్టేషన్ యజమానులు నిలదీసిన వినియోగదారులు
X

దిశ, దమ్మపేట: అసలే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఫీలింగ్ స్టేషన్ యజమానులు లాభాల కోసం కక్కుర్తి పడుతున్నారు. పెట్రోల్లో నీళ్లు కలిపి నిర్వాహకులు లాభాలు గడిస్తున్నారు. దీంతో పెట్రోల్ పోయించుకున్న వాహనాలు ఇంజన్లో సమస్య తలెత్తి ఆగిపోతున్నయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ మారుతి ఫిల్లింగ్ స్టేషన్లో.. పెట్రోల్లో నీళ్లు కలిపారని వినియోగదారులు యజమానులను నిలదీశారు. వివరాల్లోకెళ్తే..

దమ్మపేట శ్రీ మారుతి ఫిల్లింగ్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ పోయించుకొని వాహనాన్ని ఇంట్లో నిలిపివేశాడు. మరుసటి రోజు ఆ వాహనాన్ని స్టార్ట్ చేయగా.. వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో అనుమానం వచ్చి వాహనంలో నుంచి పెట్రోల్ తీయగా దాని రంగు వేరేలా ఉండడంతో పెట్రోల్ కల్తీ జరిగిందని గమనించాడు. అనంతరం ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు చేరుకొని యజమానులను నిలదీయగా.. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్పటికప్పుడు వినియోగదారుడు మరో ఫిల్లింగ్ స్టేషన్ నుండి పెట్రోల్ తీసుకువచ్చి వాహనంలో పోసిన పెట్రోల్‌కు, మరొక ఫీలింగ్ స్టేషన్లో తీసుకొచ్చిన పెట్రోల్ రంగు వేరేగా ఎందుకుందని ప్రశ్నించగా.. ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు చేసేదేం లేక ద్విచక్ర వాహనాన్ని రిపేర్ చేయిస్తామని ఒప్పుకోవడంతో వినియోగదారుడు శాంతించాడు. దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న ఫీలింగ్ స్టేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కల్తీ జరుగుతుందని వినియోగదారులు మండిపడుతున్నారు.

పెట్రోల్ కల్తీ జరగలేదు: నిర్వాహకులు

శ్రీ మారుతి ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ కల్తీ జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. బీఎస్ 6 వాహనాలలో నింపాల్సిన ప్రీమియం పెట్రోల్ను బీఎస్ 4 వాహనాల్లో నింపడం వల్లే సమస్య వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఏది ఏమైనా సరే ఫీలింగ్ స్టేషన్ యజమానులు తమ లాభాల కోసం ప్రీమియం పెట్రోల్‌ను బీఎస్ 4 వాహనాల్లో నింపడం సరికాదని వాహనదారులు మండిపడుతున్నారు.

Next Story

Most Viewed