ఎన్టీఆర్ పరిపాలన స్ఫూర్తిదాయకం : తుమ్మల

by Sridhar Babu |
ఎన్టీఆర్ పరిపాలన స్ఫూర్తిదాయకం : తుమ్మల
X

దిశ, దమ్మపేట : తనకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేట ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఆవిష్కరరించి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ తనకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీరామారావు అని, తాము ఎన్టీఆర్ రాజకీయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటి పామాయిల్ మొక్క నాటింది ఎన్టీఆర్ అని, ఆయన దయతో నేడు సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల ప్రజలు పామాయిల్ సాగు నుండి వస్తున్న ఆదాయంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. అంతే కాకుండా ఎన్టీఆర్ హయాంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వచ్చిందన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాది అని, తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఎన్టీ రామారావు చరిత్రను వివరించి, వారికి ఎన్టీరామారావు సినిమాలు చూపించాలని అన్నారు.

రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ టీడీపీ : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

నాకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. నాయుడుపేట గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించానని, పదేళ్లపాటు సర్పంచ్​గా పనిచేశానని, తుమ్మల నాగేశ్వరావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరానని, 2014లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు లాగానే తాను కూడా స్వల్ప మెజారిటీతో అదృష్టం లేక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని తెలిపారు.

అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ .ఎండా వీడలేదని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరలా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందానని, అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తనకు ఎమ్మెల్యేగా గుర్తింపు మాత్రమే ఉందని, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. తెలుగుదేశం పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్న పరిస్థితులను వివరిస్తూ ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికి 60 కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు బీటీ రోడ్లు నిర్మిస్తే, నేడు నా హయాంలో సీసీ రోడ్డు నిర్మించానని వ్యాఖ్యానించారు.

అనంతరం ఎన్టీరామారావు జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కట్రం స్వామి, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, సోయం ప్రసాద్, జల్లిపల్లి శ్రీరామమూర్తి, బండి పుల్లారావు, దారా మల్లికార్జునరావు, ధారా యుగంధర్, దొడ్డ నాగమణి, సున్నం రాము, నల్లగుల సత్యనారాయణ, వలి పాషా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed