భూలోకంలో ఆరాచకాలు చూసి బాధపడుతున్న ఎన్టీఆర్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

by Disha Web Desk 15 |
భూలోకంలో ఆరాచకాలు చూసి బాధపడుతున్న ఎన్టీఆర్ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
X

దిశ, వైరా : నేడు భూలోకంలోని రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న అరాచకాలను పై లోకం నుంచి చూస్తూ ఎన్టీఆర్ బాధపడుతుంటారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు ఆదివారం కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. పై లోకంలో ఉన్న ఎన్టీఆర్ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, అరాచకాలు చూసి బాధపడుతుంటారని చెప్పారు.

ఆయన టైం లో పరిపాలన ఎలా ఉండేదని, ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అని ఎన్టీఆర్ బాధపడుతూ ఉంటారని చమత్కరించారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ ఏకచత్రాధిపత్యంగా రాణించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. రాముడైనా, కృష్ణుడైనా ఇతర ఏ భగవంతుడిని అయినా ప్రజలు నేరుగా చూడలేదన్నారు. కానీ రాముడు, కృష్ణుడు తో పాటు అన్ని దేవుళ్ల పాత్రలలో నటించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు దేవుడయ్యారని కొనియాడారు. రాజకీయంగా ఎన్టీఆర్ రాణించి చరిత్రను సృష్టించారన్నారు. నిరుపేదల కోసం సుపరిపాలనను అందించి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొర్రా రాజశేఖర్, మువ్వా విజయబాబు, సూతకాని జైపాల్, మిట్టపల్లి నాగి ఫణితి సైదులు, దార్న రాజశేఖర్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed