బరిలో ఉండేదెవరు ... బలయ్యేదెవరు..

by Disha Web Desk 20 |
బరిలో ఉండేదెవరు ... బలయ్యేదెవరు..
X

దిశ, వైరా : అసలేం జరుగుతుందో తెలియటం లేదు... బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీ మార్పు పై రోజుకో ప్రచారం జరుగుతుంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందిమ మోగించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం తధ్యమని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నెల 20 లేదా 25వ తేదీల్లో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం వేదికగా చేరతారని గత మూడు రోజులుగా విస్తృత ప్రచారం నెలకొంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలోని 8 నియోజకవర్గాల్లో ఉన్న ఆశావహుల్లో హై టెన్షన్ నెలకొంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించి తన వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించేశారు కూడా. అయితే కర్ణాటక ఎన్నికల ముందు వరకు పొంగులేటి బీజేపీలో చేరతారని అందరూ భావించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత పొంగులేటి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అనుచరులే స్పష్టం చేస్తున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గం నుంచి పలునియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల గుండెల్లో కూడా ప్రస్తుతం రైళ్ళు పరిగెడుతున్నాయి. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలను ఆయనకి కేటాయించే అవకాశం నూటికి నూరు శాతం ఉండకపోవచ్చు. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొందేం వీరయ్య శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ స్థానాల్లో పొంగులేటి వర్గీయులకు టికెట్ లభించదనే అంశం నూరు శాతం స్పష్టమవుతుంది. మిగిలిన 8 స్థానాల్లో కూడా అనేకమంది కాంగ్రెస్ ఆశావాహులు టికెట్ పై ఆశలు పెట్టుకొని పార్టీలో పనిచేస్తున్నారు. ముందస్తుగా అభ్యర్థులు ప్రకటించటం వల్ల పొంగులేటికి తిప్పలు తప్పని పరిస్థితి నెలకొని ఉంది.

కాంగ్రెస్ ఆశావాహులు వీరే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే నూటికి నూరు శాతం టికెట్ కేటాయిస్తుంది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాల్లో టికెట్ కోసం రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క వర్గీయులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పాలేరులో పోటీ చేసేందుకు రాయల నాగేశ్వరరావు ఆసక్తి కనపరుస్తూ ఆ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం అసెంబ్లీలో తాను పోటీ చేస్తానని రేణుకా చౌదరి స్వయంగా ప్రకటించారు. వైరాలో టికెట్ కోసం మాలోత్ రాందాస్ నాయక్, ధరావత్ రామ్మూర్తి నాయక్, బానోత్ బాలాజీ నాయక్, ఇల్లందులో చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి, భూక్య రామచంద్రనాయక్, దళసింగ్ పొరిక బలరాం నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సత్తుపల్లిలో మానవతారాయ్, సంబాని చంద్రశేఖర్, మట్టా దయానంద్ , దయానంద్ కు టికెట్ ఇవ్వలేని పక్షంలో ఆయన భార్య రాగమయి, పినపాక నియోజకవర్గంలో భట్టా విజయ గాంధీ, పోలెబోయిన శ్రీవాణి, ధనసరి సూర్య, కాటబోయిన నాగేశ్వరరావు, చందా సంతోష్ కుమార్ కొత్తగూడెంలో యడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు అశ్వరావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.

వీరంతా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జూడో కార్యక్రమాలతో పాటు ఇతర పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ కోసం మరింత పోటీ నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్లో పనిచేస్తున్న ఆశావాహులు పొంగులేటి తమ పార్టీలో చేరితే తమకు టికెట్ వస్తుందో రాదో అని ఇప్పటికే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తాము అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది.

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రకటించిన అభ్యర్థులు వీరే...

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాల స్థాయి ఆత్మీయ సమ్మేళనాల్లో తన వర్గం నుంచి అభ్యర్థులను ప్రకటించారు. మధిర నుంచి కోటా రాంబాబు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావులను పొంగులేటి తన అభ్యర్థులుగా ప్రకటించారు. పొంగులేటి కాంగ్రెస్లో చేరితే ఈ ఇరువురి అభ్యర్థులకు టికెట్ వచ్చే అవకాశం ఉండదు. వైరా నుంచి బానోత్ విజయభాయి, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, సత్తుపల్లి నుంచి కొండూరు సుధాకర్, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణల పేర్లను పొంగులేటి ప్రకటించారు. ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కొత్తగూడెం నుంచి తన అభ్యర్థిగా ఊకంటి గోపాలరావును నిలిపేందుకు గతంలో పొంగులేటి ప్రయత్నాలు చేశారు. పొంగులేటి తరుపున వైరా నుంచి పోటీ చేసేందుకు బానోత్ విజయభాయి సీపీఐ పార్టీ నుంచి ఆయన వర్గంలో చేరింది.

సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు కొండూరు సుధాకర్ పంచాయతీరాజ్ శాఖలోని ఈ ఉద్యోగానికి స్వతంత్రంగా పదవి విరమణ చేశారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఉన్న క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఆయన వర్గీయులకు టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 8 నియోజకవర్గాల్లో మొత్తం టికెట్లను పొంగులేటి వర్గీలకు కేటాయించే అవకాశం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో పొంగులేటిని నమ్ముకుని ఇతర పార్టీల నుంచి అతని వైపు వచ్చిన అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పొంగులేటి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ ఆశావాహులతో పాటు పొంగులేటి గతంలో ప్రకటించిన అభ్యర్థుల్లో టికెట్ ఎవరికీ కేటాయిస్తారనే అంశం ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ ఆశావాహులతో పాటు పొంగులేటి అభ్యర్థులు కూడా కొంతమంది బలవ్వక తప్పదనే అభిప్రాయాలు సర్వత్ర వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed