ప్రేమ పెళ్లిపై కుల బహిష్కరణ

by S Gopi |
ప్రేమ పెళ్లిపై కుల బహిష్కరణ
X

దిశ, సత్తుపల్లి: ఇద్దరూ ప్రేమించుకున్నారు...ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించారు. అయితే వారిద్దరి కులాలు వేరు. అయినా తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు వాళ్ల కుల సంఘం పెద్దలు. ప్రేమ పేరుతో కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ... అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు మాత్రం అమ్మాయి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్న ఆమె కుటుంబాన్నీ బహిష్కరించిన కుల సంఘం పెద్దలపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన తడికమల్ల ప్రేమ్ కుమార్(ఎస్సీ మాదిగ), పెండ్ర జీవిత (బీసీ మందుల) కులాలకు చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకు ఇరువురి తల్లిదండ్రులకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ...ఆ గ్రామంలో అమ్మాయి తరపు కులానికి చెందిన కుల సంఘం పెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అమ్మాయి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ. 20 వేలు జరిమానా, ఆ కుటుంబంతో ఎవ్వరైనా మాట్లాడినా, శుభ కార్యాలకు పిలిచినా జరిమానా విధిస్తామని కుల సంఘం పెద్దలు తీర్మానం చేయడంతో ఆ గ్రామంలో చర్చనీయాంశం అయింది. కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్న చందాన కుల పెద్దల బహిష్కరణ తీరు ఉందని స్థానికులు నవ్వుకుంటున్నారు. తమ కుల సంఘం పెద్దలు తన కుటుంబాన్ని బహిష్కరించారని పెనుబల్లి పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed