ఖమ్మం బీఆర్ఎస్ పై మైనార్టీల గుస్సా

by Disha Web Desk 15 |
ఖమ్మం బీఆర్ఎస్ పై మైనార్టీల గుస్సా
X

దిశ బ్యూరో, ఖమ్మం : ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నియమించినట్లు ప్రచారమవుతున్న సమన్వయకర్తల వ్యవహారం చినికిచినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. తమ సామాజికవర్గానికి ప్రియారిటీ లభించలేదని, వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తమ తడాఖా చూపిస్తామంటూ సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ కావడం సంచలనంగా మారింది. కొత్తగా పార్టీలో చేరినవారికి అవకాశం కల్పిస్తూ తమను కావాలనే అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సమన్వకర్తలను నియమించినట్లు వారి పేర్లు సోషల్ మీడియాలో, పలు పత్రికల్లో రావడంతో ముస్లిం మైనార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఫైర్ అవుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు, రాజకీయాలకు తమకు అనుకూలంగా మార్చుకునేవారినే ఎంపిక చేశారని దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

సమన్వయకర్తలు వీరేనంటూ..

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు వీరేనంటూ సోషల్ మీడియాతో పాటు, వివిధ పత్రికల్లో గురువారం వార్తలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినట్లు వచ్చాయి. పాలేరు‌- తాత మధు, ఖమ్మం ‌- కూరాకుల నాగభూషణం, వైరా ‌- తాళ్లూరి జీవన్, మధిర ‌- కొండబాల కోటేశ్వరరావు, కొత్తగూడెం ‌- ఉప్పలపాటి వెంకటరమణ, సత్తుపల్లి ‌- బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అశ్వారావుపేట ‌- కోనేరు చిన్నిల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నియామకమే ఇప్పుడు గాలిదుమారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్..

సమన్వయకర్తల పేర్లు బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఒక వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మౌనం వహించామని ఇక దాపరికం లేకుండా తమ ప్రయోజనాల కోసం పోరాడుదామని పిలుపునిస్తున్నారు. కమిటీలో అన్ని వర్గాలకు చోటు ఇవ్వాలని కోరినా పార్టీ పెద్దలు పెడచెవిన పెడుతున్నారని, కావాలనే తమను పట్టించుకోవడం మానేశారని ఆవేదన చెందుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మైనార్టీ అభ్యర్థిని పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోలేదని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నామ నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినా పార్టీ విజయం కోసం నిర్ణయాన్ని స్వాగతించామని వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా బాధ్యుల పేర్లు చూశాక బీఆర్ఎస్ పార్టీ, జిల్లా నాయకులు మైనార్టీల ప్రయోజనం కోసం ఏ స్థాయిలో కట్టుబడి ఉన్నారో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 55 వేల ఓటుబ్యాంకు కలిగిన తమను ఇంకా ఓటర్లుగానే చూస్తున్నారని, ఏ మాత్రం ప్రియారిటీ ఇవ్వడం లేదని, మైనార్టీల ఎదుగుదలను ఓర్వలేకపోవడమే ఇదంటూ ఫైర్ అయ్యారు. సత్తుపల్లి బాధ్యునిగా బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమ్మం బాధ్యునిగా కూరాకుల నాగభూషణం పేర్లను జిల్లా నాయకులకు తెలియకుండానే అధిష్టానం వెల్లడించిందా? అంటూ ప్రశ్నించారు. భవిష్యత్ రాజకీయాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భావించే కీలక బాధ్యతల్లో మైనార్టీలకు అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, లేదంటే రేపు జరిగే పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను సైతం బహిష్కరిస్తామని వెల్లడించారు.

రాజీనామాలకు సిద్ధం..

తమకు ప్రియారిటీ లేకుండా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని, నియోజకవర్గ బాధ్యులను తక్షణమే మార్చి అందరికీ అవకాశం కల్పించాలని లేదంటే మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామని మైనార్టీలు వెల్లడించారు. తమను ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు ఇంతకాలం సేవ చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని, తమకు ఎలాంటి పదవులు దక్కకుండా జిల్లా నాయకులు అడ్డుకున్నారని తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు.

బాజీబాబా నామినేషన్..

బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ బరిలో విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాజీబాబా రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు మైనార్టీ పెద్దలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీ కే అవకాశం కల్పించాలని పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జిల్లా నాయకత్వానికి విన్నవించినా స్పందించకపోవడంతో ముస్లిం హక్కుల ప్రయోజనాల కోసమే తాను పోటీ చేస్తున్నట్లు బాజీబాబా తెలిపారు.

అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్ సైతం ఓ ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ పార్టీపై నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. మైనార్టీల సేవలను పార్టీ గుర్తించకపోవడం ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా నాయకులను అడిగినా ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ పొంతన లేని సమాధానం చెబుతున్నారని, మైనార్టీ సోదరులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అందరి సమక్షంతో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అతిత్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని గౌరవ ప్రదమైన నిర్ణయం తీసుకుందామని మైనార్టీలకు సూచించారు.

అది తప్పుడు ప్రకటన : తాత మధు

ఈ విషయమై జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుని వివరణ అడగ్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పేర్లు తప్పు అని చెప్పారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు బాధ్యులను నియమిస్తామన్నారు.

Next Story

Most Viewed