- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్

దిశ, మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగిన మధిర రైల్వే స్టేషన్ ఇకనుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన డీపీఆర్లు సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డును ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని కొండపల్లి నుండి తెలంగాణ రాష్ట్రం పరిధిలోని బోనకల్ మండలం మోటమర్రి వరకు 64 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లు మొత్తం కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి.
దీంతో ఖమ్మం జిల్లాలో ఖమ్మం తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్ గా ఉన్న మధిర రైల్వే స్టేషన్ ఇకనుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నప్పుడు ఉద్యోగ అవసరాల దృష్ట్యా రైల్వే ఉద్యోగులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు 294 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు మధిర ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు రైల్వే ఉద్యోగులు ,రైల్వే పనులు కోసం 54 కిలోమీటర్ల సమీపంలోని విజయవాడలోనే డీఆర్ఎం కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో దెందుకూరు, తొండలగోపారం, ఎర్రుపాలెం, రేమిడిచర్ల స్టేషన్ పరిధిలో పనిచేసే రైల్వే ఉద్యోగులు కొండపల్లి సెక్షన్ లో కొనసాగేవారు. మోటమర్రి నుంచి కొండపల్లి వరకు పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్ళవలసి ఉంటుంది.