ఖమ్మంలో మళ్లీ మాత్రల దందా షూరు.. ఆ ఇంజెక్షన్‌కు భారీగా డిమాండ్!!

by Satheesh |
ఖమ్మంలో మళ్లీ మాత్రల దందా షూరు.. ఆ ఇంజెక్షన్‌కు భారీగా డిమాండ్!!
X

ఖమ్మం పట్టణంలోని మెడికల్ షాపులు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. కనీస ప్రమాణాలను పాటించడం లేదు. ఫార్మాసిస్ట్, రిఫ్రిజిరేటర్ లేకుండానే కొనసాగిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను పేషెంట్లకు అంటగడుతున్నారు. లైసెన్స్ గడువు తీరినా రెన్యువల్ ఊసెత్తడం లేదు. కనీసం 10శాతం షాపుల్లో ప్రతి రోజు మేయిన్‌టేన్ చేయాల్సిన బిల్స్ రాయడం లేదు. గడువు దాటిన మందులను ప్రత్యేకంగా ఉంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు పట్టణంలో ఫోర్ట్ విన్ ఇంజక్షన్ల అమ్మకం జోరుగా నడుస్తోంది. మత్తుకు బానిసలైన యువకులను టార్గెట్ చేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు సమాచారం. పట్టించుకోవాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ.. ఎంత పెద్ద తప్పిదమైనా కేవలం నోటీసులతోనో లేక చిన్న చిన్న కేసులతోనో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, ఖమ్మం అర్బన్: ఖమ్మం పట్టణంలో దాదాపు 500పైగా మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో అతి కొన్ని మాత్రమే నియమ నిబంధనలు పాటిస్తున్నాయి. మిగతా వాటికి ఎలాంటి నియమాలు పట్టవు. షాపులో పార్మాసిస్ట్ ఉండడు, కొన్ని చోట్ల రిఫ్రిజిరేటర్ ఉండదు, ఉన్నా పని చేయదు. రిఫ్రిజిరేటర్‌లో ఉండాల్సిన మందులు ఫ్రిడ్జ్‌లో ఉంచరు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎలాంటి మందులైనా అమ్ముతారు. ప్రిస్క్రిప్షన్‌లో లేకుండానే కొన్ని రకాల మందులు పేషంట్లకు అంటగడతారు. దుకాణం లైసెన్స్ గడువు తీరినా పట్టింపు ఉండదు. కనీసం 10శాతం షాపుల్లో ప్రతి రోజు బిల్స్ రాయరు. కొందరు దుకాణ యజమానులు అసలు బిల్ బుక్స్ మేయింటేన్ చేయరు. షెడ్యూల్ H, H1 రిజిస్టర్ ఖచ్చితంగా మెయింటన్ చేయాల్సి ఉన్నా ఆ రిజిస్టర్ ఆనవాళ్ళు కూడా ఉండదు. గడువు దాటిన మందులను ప్రత్యేకంగా ఉంచాల్సి ఉన్నా అలాంటివేమీ పట్టించుకోరు. ప్రతి ఔషధానికి సంబంధించి బ్యాచ్ నెంబర్, తయారీ కంపెనీ, ఎక్స్‌పైరీ కూడిన కొనుగోలు, అమ్మకాల బిల్లును ఖచ్చితంగా దుకాణ యజమానులు మేయిన్‌టేయిన్ చేయాల్సి ఉన్నా అవేమి పట్టించుకోరు.

పట్టణంలో మరోసారి ఫోర్ట్ విన్ ఇంజక్షన్ల అమ్మకం దండిగా నడుస్తోంది. గతంలో పూర్తి స్థాయిలో కట్టడి అయిన ఫోర్ట్ విన్ ఇంజక్షన్, కొడెన్ ఫాస్పేట్ దగ్గుమందుల అమ్మకాలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. మత్తుకు బానిసయిన యువకులు ఇప్పుడు ఇన్‌హేలర్స్, ట్రిప్టోమర్ మాత్రలు, ట్రమడాల్ మాత్రలు, కాఫ్ సిరప్ వాడుతున్నారు. దీన్ని అవకాశంగా మలచుకున్న దుకాణ యజమానులు ఇష్టారీతిగా అమ్మకాలు కొనసాగిస్తూ యువతను మత్తులోకి లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ల తనిఖీలు తూతూ మంత్రంగానే ఉన్నాయి. ఎంత పెద్ద తప్పిదమైనా కేవలం నోటీసులతోనో లేక చిన్న చిన్న కేసులతోనో సరిపెడుతున్నారు. గతంలో దిశ వెలుగులోకి తెచ్చిన ఆక్సిటోసిన్ అమ్మకానికి సంబంధించి అంగట్లో ఆక్సిటోసిన్ శీర్షికిన వచ్చిన కథనానికి కేసులు నమోదు చేశామని చెప్పినా మొత్తం ఎన్ని షాపులపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పకపోవడం గమనార్హం.

త్వరలోనే తనిఖీలు.. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ప్రసాద్

పట్టణంలో 500పైన షాపులకు కేవలం ఒక్క డ్రగ్ ఇన్‌స్పెపెక్టర్ ఉండటంతో భారం అధికంగా ఉంది. దుకాణయజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేనిచో కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్స్‌లు రద్దుచేస్తాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి వెనుకాడబోం.



Next Story