ఆస్తి పన్నుల్లో అక్రమాలు...ప్రభుత్వానికి పంగనామాలు

by Disha Web Desk 15 |
ఆస్తి పన్నుల్లో అక్రమాలు...ప్రభుత్వానికి పంగనామాలు
X

దిశ, ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ ఆదాయం కు కొంత మంది కేటుగాళ్లు గండి కొడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో కొత్తగా నిర్మించిన పెద్ద బహుళ అంతస్తుల కు నామమాత్రంగా ఆస్తి పనులను కుదించి కార్పొరేషన్ ఆదాయానికి చిల్లులు పెడుతున్నారు. నగరంలో వైరా రోడ్డు, మయూరి సెంటర్ లో నూతనంగా నిర్మించిన పెద్ద బిల్డింగులకు వచ్చే ఆస్తి పన్నులను చూస్తే కళ్ళు బైర్లు కమ్మినట్లు అయిపోతాయి. కార్పొరేషన్ సిబ్బంది ప్రతి నెలా ఆస్తి పన్ను ఇచ్చే సమయంలో ఇంత పెద్ద బిల్డింగులకు ఇంత తక్కువ పన్నులు ఎలా వస్తుంది అని ఆలోచన కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రాంతం కమర్షియల్ గా పేరు పొందింది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా లక్షల్లో నెలసరి అద్దె ఉన్నప్పటికీ ఆరు నెలలకు పన్నులు మాత్రం వేలల్లో రావటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మధ్యతరగతి కుటుంబ గృహాలకు పన్నులు కట్టలేదని మున్సిపల్ సిబ్బంది నానా హడావుడి చేస్తున్నా బహులాంతస్తులకు పన్నులు ఎందుకు తక్కువగా వస్తున్నాయని అటువైపు ఎందుకు దృష్టి సారించటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బిల్డింగులు పెద్దవి... పన్నులు చిన్నవి...

ఖమ్మం నగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది. అదే తరహాలో ఎక్కడ చూసినా పెద్దపెద్ద అంతస్తులే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు కార్పొరేషన్ ఆదాయం రాకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని కార్పొరేషన్ అధికారులు చెప్పుకుంటున్నారు. బిల్డింగ్ నిర్మాణం తర్వాత కార్పొరేషన్ అధికారులు బిల్డింగ్ కొలతలు తీసుకొని ఆస్తి పన్నులు వేయాలి. కానీ ఇక్కడ మాత్రం బిల్డింగ్ యజమానులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి నామ మాత్రం కొలతలు విధించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దీంతో కార్పొరేషన్ కి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడుతుంది. వైరా రోడ్ లోని 5 అంతస్తుల బిల్డింగ్ కు వేలల్లోనే ఆస్తిపన్ను వస్తుంది. నెహ్రు నగర్ లో నిర్వహిస్తున్న ఆసుపత్రి పాత ఇంటి ప్రకారంగానే ఇంటి పన్ను రావటం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నూతన బిల్డింగ్ లకు ప్రభుత్వం విధించిన కొలతలకు అనుగుణంగా ధర విధించాలి. కానీ ఇక్కడ మాత్రం కొలతలు తక్కువగా చూపించి ప్రభుత్వం విధించిన ధరకు పొందు పరుస్తున్నారు. ఖమ్మం నగరంలో కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు, మూడు, నాలుగు, ఐదు అంతస్తులకు కూడా రెసిడెన్షియల్ పన్నులు విధిస్తున్నారు. ఇక్కడ మాత్రం బిల్డింగ్ ఓనర్లు కిరాయికి ఇచ్చుకుంటూ కమర్షియల్ గా ఆదాయాన్ని పొందుతున్నారు. వైరా రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్డు, గట్టయ్య సెంటర్ , ఎన్ ఎస్ టీ రోడ్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులు, బిల్డింగ్ లో కూడా నామమాత్రంగానే పన్నులు వేస్తున్నారు.

కమిషనర్ సారు దృష్టి సారించాలి

ఖమ్మం నగరంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లకు వచ్చే నామమాత్రపు ఆస్తి పన్నులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఆస్తి పన్నులపై గోల్ మాల్ జరుగుతున్నా కార్పొరేషన్ శాఖ సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి బిల్డింగ్ లపై దృష్టి సారించి నామ మాత్రంగా వచ్చే ఆస్తి పన్నులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed