అడ్డగోలు అనుమతులు.. రూ.14 లక్షల ఆదాయానికి గండి

by Taduka Kalyani |   (  Updated:2026-06-09 09:08:52  IST  )

వైరా మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు.

అడ్డగోలు అనుమతులు.. రూ.14 లక్షల ఆదాయానికి గండి
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతూ అక్రమ మార్గాల్లో తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి కమిషనర్ వరకు సూత్రధారులు పాత్రధారులుగా మారుతున్నారు. తాజాగా వైరా మున్సిపాలిటీలో ఓ భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన అనుమతులు వివాదస్పదంగా మారాయి. ఒక లక్ష కాదు..... రెండు లక్షల కాదు ఏకంగా మున్సిపాలిటీ ఆదాయానికి రూ.14 లక్షలు గండి కొట్టి మరి భవన నిర్మాణానికి తప్పుడు అనుమతులు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు అందిన కాడికి దండుకున్నారనే విమర్శలు మున్సిపాలిటీ వర్గాల్లోనే బహిరంగంగా వినిపిస్తున్నాయి. వైరాలోని పాత బస్టాండ్ సెంటర్లో 848.73 గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల్లో అడుగడుగున అవినీతి కనిపిస్తోంది. అయినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ భవన నిర్మాణం కోసం మున్సిపాలిటీకు సుమారు రూ.25 లక్షలు ఫీజుల రూపంలో రావాల్సి ఉండగా, అధికారులు రూ.11 లక్షలు ఫీజుల రూపంలో తీసుకొని అనుమతులు మంజూరు చేశారు. ఈ అనుమతులు మంజూరు చేసిన అధికారులకు లక్షలాది రూపాయలు ముడుపులు అందాయనే ప్రచారం జరుగుతోంది.

భవన అనుమతుల్లో అక్రమాలు...


వైరాలోని పాత బస్టాండ్ సెంటర్లో గతంలో ఉన్న పురాతన భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించేందుకు అక్రమంగా అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ సెంటర్లో 10-122, 10-122/A, 10-123 ఇంటి నెంబర్ల పై ముగ్గురు వ్యక్తులకు 848.73 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో నూతన భవన సదుపాయాన్ని నిర్మించుకునేందుకు 2025 డిసెంబర్ 15వ తేదీన 1972 సంవత్సరంలో ఇంటి పన్ను చెల్లించినట్టు ఫోర్జరీ ఇంటి పన్ను రసీదులతో టీజీ బీ పాసులో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో ఫోర్జరీ ఇంటి పన్ను రసీదులతో పెట్టిన దరఖాస్తును అదేరోజు టీపీఓ ఇటుకల భాస్కర్ ఆన్లైన్ లో అప్రూవల్ చేశారు. ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ యూ గురులింగం ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ఇంటి పన్ను రసీదులు ఫోర్జరీ అని గుర్తించారు. 1972వ సంవత్సరంలో వైరా మేజర్ గ్రామపంచాయతీ గా లేదు. ఆ రసీదుల్లో అనేక తప్పిదాలు ఉండటంతో ఫోర్జరీ గా వాటిని గుర్తించిన కమీషనర్ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో టీపీఓ భాస్కర్ వ్యవహార శైలి అప్పట్లో బహిర్గతమైంది. అనేక సార్లు టీపీఓ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కమిషనర్ ను కోరినప్పటికీ అందుకు ఆయన నిరాకరించారు....

కమిషనర్ మారిన వెంటనే రంగంలోకి టీపీఓ...


ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన వైరా మున్సిపాలిటీ కమిషనర్ యూ గురులింగం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అడిషనల్ చార్జ్ పై మధిర కమిషనర్ సంపత్ ఏప్రిల్ 5వ తేదీన వైరాలో బాధ్యతలు తీసుకున్నారు. అయితే నూతన కమీషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే టీపీఓ గత ఫైలును మార్చి మరో కొత్త ఫైల్ ను భవన నిర్మాణం కోసం రంగంలోకి తీసుకువచ్చారు. పాత బస్టాండ్ లోని 843.73 గజాల స్థలం కు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు యజమానులకు ఎల్ఆర్ఎస్ నగదు తగ్గించేందుకు మార్కెట్ విలువను కుదించారు. ఇటీవల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచక ముందే ఈ ప్రాంతంలో గజం మార్కెట్ విలువ రూ.10800 ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా గజం మార్కెట్ విలువ రూ.5800 చొప్పున చూపి చెల్లించాల్సిన ఎల్ఆర్ఎస్ నగదును పూర్తిస్థాయిలో తగ్గించారు. ఈ వ్యవహారంలో టీపీఓ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కమిషనర్ సంపత్ ఈ అనుమతులు ఇచ్చే విషయంలో ఉత్సాహాన్ని చూపారు. మార్కెట్ విలువ తగ్గించటంతో మున్సిపాలిటీ కు రూ.25 లక్షలు రావాల్సిన ఆదాయం రూ.11 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అధికారులకు లక్షలాది రూపాయలు చేతులు ముట్టాయనే ప్రచారం జరుగుతుంది.


నిబంధనల ప్రకారం ప్రస్తుతం పాత బస్టాండ్ లో గజం స్థలం కు మార్కెట్ విలువ రూ. 10800 ఉంది. ఈ లెక్కల ప్రకారం 848.72 గజాలకు ఓపెన్ ప్లాట్ చార్జెస్ 14% కింద రూ.1283273, బెటర్మెంట్ చార్జెస్ రూ. 266107, పేనలైజేషన్ చార్జెస్ 33% కింద రూ. 511297 నగదును మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. ఈ నగదు మొత్తం రూ. 2060683 అవుతుంది. వీటితోపాటు కన్వర్షన్ చార్జెస్, సైట్ అప్రూవల్ చార్జెస్, బిల్డింగ్ పర్మిట్ ఫీజు, డెవలప్మెంట్ చార్జెస్, బిల్డప్పర్ ఏరియా చార్జెస్, డెవలప్మెంట్ చార్జెస్ ఆన్ ల్యాండ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చార్జెస్, అడ్వర్టైజ్మెంట్ చార్జెస్, కాంపౌండ్ వాల్ చార్జెస్, వెకెండ్ ల్యాండ్ టాక్స్, లేబర్ సెస్, టెబ్రిస్ చార్జెస్, టీఎస్ బి పాస్ యూజర్స్ చార్జెస్ భవన యజమాని చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం నిబంధనకు అనుగుణంగా 848.73 గజాల స్థలానికి భవన అనుమతుల కోసం మున్సిపాలిటీకి మొత్తం రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా మార్కెట్ విలువ తగ్గించి కేవలం రూ. 11 లక్షలకే భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇలా మున్సిపాలిటీ ఆదాయానికి ఏకంగా రూ.14 లక్షలకు గండి కొట్టారు. అయినప్పటికీ మున్సిపాలిటీలోని పాలకవర్గం కనీసం ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదు. మున్సిపాలిటీలోని అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి ఆదాయానికి గండి కొట్టిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story