వేల చెట్లు నేల మట్టం.. వాల్టా చట్టానికి తూట్లు..

by Disha Web Desk 13 |
వేల చెట్లు నేల మట్టం.. వాల్టా చట్టానికి తూట్లు..
X

దిశ, నేలకొండపల్లి: కంకర, గ్రావెల్ తరలింపుకు రెండు నెలల కోసం తాత్కాలిక అనుమతి పొందిన పవర్ మెక్ సంస్థ నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. సింగారెడ్డి పాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 350లో 90.36 ఎకరాల్లో 50,000 మెట్రిక్ టన్నుల పరిమాణానికి కంకర తరలించేందుకు తాత్కాలిక అనుమతి పొందింది. అయితే అక్కడ ఉన్న గుట్ట నేల మట్టానికి 08 మీటర్ల ఎత్తు ఉందని, వివిధ బండరాళ్ల చెట్లు, కంకరతో పొదలు ఉన్నట్లు పేర్కొన్నారు.

దీనిని రహదారి నిర్మాణం కోసం భూ యజమాని ద్వారా భూ లెవల్ వరకు తరలిస్తామని దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ అందుకు భిన్నంగా భూ లెవల్‌కి విరుద్ధంగా 15 నుంచి 20 అడుగులు గోతులు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. రెండు నెలలు పూర్తి కావస్తున్నా గుట్టను వదిలి పక్కన ఉన్న మట్టిని తరలిస్తున్నారు. రూ. లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.


ఇచ్చిన అనుమతి మేరకు మైనింగ్‌ శాఖకు పన్ను చెల్లించాలి. క్యూబిక్‌ రూ.42 చొప్పున చెల్లించాకే మట్టి తవ్వకాలు జరపాలి. నేలకొండపల్లి కేంద్రంతోపాటు మండలం లో భైరవుని పల్లి, చేర్వుమధరం, తదితర గ్రామాల శివారులోని ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీ ల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టిన టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. కొందరు చోటా, బడా నాయకులు, అనుచరులు ఈ దందాకు సహకరిస్తున్నారని తెలుస్తోంది.


ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న నియంత్రించే నాథుడే కరువయ్యారు. ఇదే అదనుగా కొందరు వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్‌ భవనాలు, రియల్‌ వెంచర్స్‌, గోదాం నిర్మాణాలకు మండలంలో కొందరు టిప్పర్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాని మైనింగ్‌ శాఖ అధికారి సంజయ్‌ను వివరణ కోరగా మట్టి తరలించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అక్రమంగా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కాకుండా గుంతలు తవ్వితే అనుమతి రద్దు చేస్తామని అన్నారు.

వాల్టా చట్టానికి తూట్లు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు పెంచుతూ పర్యావరణ సమతుల్యానికి కృషి చేస్తోంది. కానీ సింగారెడ్డిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 350 లో గుట్టకు కాకుండా చదును భూమి తో ఎన్నో చెట్లు ఉన్నాయి. వాటిని కూకటి వేళ్లతో సహా పెకిలించి మరీ విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed