బడాబాబుల బరితెగింపు.. ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణం

by samatah |
బడాబాబుల బరితెగింపు.. ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణం
X

దిశ,కొత్తగూడెం: గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ బడాబాబుల బరితెగింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజకీయ పలుకుబడులను ఉపయోగిస్తూ కనీస అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది. గిరిజన చట్టమైన 1/70 పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఉండదు. అయినప్పటికీ కొంతమంది గిరిజనేతరులు చట్ట వ్యతిరేకంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత వ్యాపారాలు గణనీయంగా పెరగడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి హౌసింగ్ బోర్డు వరకు వ్యాపార సముదాయాలు ఊహించని రీతిలో విస్తరించాయి. కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఆనుకొని ఉన్న భూములలో అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఈ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి అని తెలిసినా ధన బలం రాజకీయ అండదండలు ఉన్న కొంతమంది బరితెగించిన బడాబాబులు బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టి కళ్ళముందే పూర్తి చేస్తున్నారు.

అధికారులు నోటీసులు ఇచ్చినా ఆగని నిర్మాణ పనులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ పంచాయతీ పరిధిలో గల స్పైసీ దాబా ఎదుట అనుమతులు లేని బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారు. ఆనోటా ఈనోటా అధికారుల చెవిన పడడంతో నిర్మాణ పనులు తక్షణమే ఆపాలంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పంచాయతీ అధికారుల ఆదేశాలను సవాల్ చేస్తూ నోటీసులతో చేసేదేమీ లేదు అంటూ నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసే దశకు తీసుకువచ్చారు.ఈ అంశంపై విద్యానగర్ పంచాయతీ ఈవో నీ వివరణ కోరగా నిర్మాణం మొదటి దశ నుంచే నోటీసులు ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మాట వినకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు మరోసారి నోటీసులు జారీ చేస్తాం అంటూ తమ సమాధానాన్ని చెప్పారు. ఏది ఏమైనా అధికారులను సవాల్ చేస్తూ నిర్మాణాన్ని పూర్తి దశకు తీసుకురాగలిగిన ఆ పెద్దమనిషికి ధన బలం రాజకీయ బలం మెండుగా ఉండటం వల్లే సాధ్యమైందని పట్టణంలో చర్చ సాగుతోంది.




Next Story

Most Viewed