ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కలిగినా?

by Taduka Kalyani |

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కలిగినా?
X

దిశ, ఏన్కూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఏన్కూర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల రేకులు పగిలిపోవడం, కొన్ని అసంపూర్తిగా ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు మరుగుదొడ్లను ఎలా వినియోగిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో 35 ప్రాథమిక పాఠశాలలు, 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక కేజీబీవీ, ఒక టీఎస్‌ఆర్‌ఎస్ పాఠశాల ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,528 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా, వారికి బోధన చేసేందుకు 179 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైనప్పటికీ పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతుండటంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు మరుగుదొడ్ల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story