పోడుభూముల పట్టాల పేరుతో చేతివాటం

by Disha Web Desk 15 |
పోడుభూముల పట్టాల పేరుతో చేతివాటం
X

దిశ, ములకలపల్లి : ప్రతి దాన్ని సొమ్ము చేసుకునే దళారీలు సమయం కోసం వేచిచూస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్దం చేసినట్లు ప్రకటించిందే తడవు హక్కుదారులతో మంతనాలు జరిపి ఎకరా పోడు భూమికి రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జూన్ 24న పోడు పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే హక్కు పత్రాలు సిద్దం చేసింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు.

దీనిని ఆసరా చేసుకున్న దళారీలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్​లు వారి అనుయాయులతో, అటవీ శాఖ అధికారులతో ఈ వసూళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చైతన్యవంతమైన గిరిజన రైతులు కొందరు ఎదురు తిరగటంతో ఈ విషయం బయటకు పొక్కింది. అనేక మంది రైతులు ఇప్పటికే డబ్బులు ముట్టజెప్పినట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వకుంటే మీకు హక్కు పత్రాలు రావని బెదిరింపులకు దిగుతున్నట్లు పోడు సాగుదారులు వాపోతున్నారు.

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు : ఎంపీడీఓ శ్రీను

పోడు భూముల హక్కు పత్రాల కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి వసూళ్లు ఎక్కడ జరిగినా తనకు సమాచారం ఇస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాము. దయచేసి రైతులు ఎవరూ దళారీల మాటలు నమ్మి డబ్బు చెల్లించి మోసపోవద్దు.


Next Story