ప్రభుత్వానికి ఉత్సవాలు నిర్వహించే నైతిక హక్కు లేదు

by Disha Web Desk 15 |
ప్రభుత్వానికి ఉత్సవాలు నిర్వహించే నైతిక హక్కు లేదు
X

దిశ,ఇల్లందు : ప్రభుత్వానికి దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించే నైతిక హక్కు లేదని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకుడు ఇస్లావత్ కోటేష్ అన్నారు. ఇల్లందు మండలం బోయి తండా గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనారాయణ తండాలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ నాయకుడు ఇస్లావత్ కోటేష్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉత్సవాలు నిర్వహించే నైతిక అర్హత లేదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వానికి ఆ హక్కు లేదని అన్నారు . సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర ఏడవ మహాసభ పిలుపు మేరకు మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించామనారు.

గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ,నిరుద్యోగాన్ని పెంచిందని, ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని , కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్ క్రమబద్దీకరణ చేయడంలో విఫలమయ్యాడని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో మోసం చేశాడని ,రైతులకు రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసం చేశాడని, పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నాడని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వడంలో విఫలమయ్యాడని ఆరోపించారు. నిరుద్యోగులందరికీ జీవన భృతి అందించడంలో విఫలమయ్యాడని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరుస్తానని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు కన్నీళ్లు ప్రజలకు మిగిలాయని, రాజ భోగాలు కేసీఆర్ కుటుంబానికని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాన్ని ఉదృతం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని కోరారు. దీక్ష దివస్ సందర్భంగా ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో దీక్ష దివస్ ను నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా గ్రామ నాయకులు భూక్య రవి, బోడ శంకర్, భూక్య బాలాజీ, బానోత్ శంకర్, భూక్య సురేష్, బోడా బుజ్జి, ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకురాలు బోడ విజయ, బోడ శాంత, బోడ విజయ పాల్గొన్నారు.


Next Story

Most Viewed