పొంగులేటి పార్టీ మార్పుపై అనుచరుల ఎదురుచూపులు

by Disha Web Desk 12 |
పొంగులేటి పార్టీ మార్పుపై అనుచరుల ఎదురుచూపులు
X

కొత్తగూడెం వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటి సారథ్యంలో ఊరూరా ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కొత్తగూడెంలో 20 వేల మందితో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పొంగులేటి అభిమానులు తరలిరానున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి నాయకులు వివాదాల్లో ఇరుక్కుని ప్రజాదరణ కోల్పోయిన తరుణంలో పొంగులేటి రాక ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు పార్టీ మార్పు విషయమై ఆయన అనుచరుల్లో ఆసక్తి నెలకొన్నది. ఆయన నిర్ణయం కోసం చాలా మంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం మాట్లాడతారనే సస్పెన్స్ నెలకొన్నది. మరోవైపు కొత్తగూడెంలో పొంగులేటి పర్యటనతో అభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడవడిక పూర్తి భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. పార్టీలు, పదవులు లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి సాధక బాధల్లో పాలుపంచుకుంటారని ప్రజల్లో అభిప్రాయం ఉంది. ప్రజల మన్ననలు పొందిన నేతగా నిలుస్తున్నాడు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు పర్యటించే నాయకులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెంపపెట్టుగా నిలుస్తున్నాడు.

ఎన్నికలతో సంబంధం లేదు నిత్యం ప్రజల మధ్య పర్యటనలు చేస్తూ మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు పర్యటించి జనాదరణ సంపాదించుకోవడంలో పొంగులేటి సక్సెస్ అయ్యాడని రాజకీయ వర్గ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమైన పొంగులేటి పార్టీ మార్పుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ ఏ పార్టీ గుర్తు లేకున్నా ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలంటూ గత ఐదేళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూనే ఉన్నారు.

పార్టీ మార్పుపై ద్వితీయ స్థాయి నాయకుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. జెండా లేకున్నా ఎజెండాతో ముందుకు సాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచేందుకు అధికార, ప్రతిపక్ష ద్వితీయ స్థాయి నాయకులు ఎంతో మంది ప్రముఖులు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లో ఉన్న వీరంతా పార్టీపై క్లారిటీ వచ్చిన అనంతరం బహిరంగంగానే పొంగులేటితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా పొంగులేటి వెంట కనపడకున్నా పొంగులేటికి రహస్య స్నేహితులుగా ఉంటూ నేడో రేపో శ్రీనివాసరెడ్డితో నడవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. వార్డు మెంబర్ల నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల వరకు పొంగులేటి పార్టీ మార్పు కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తున్నది.

Next Story

Most Viewed