వల్లాపురాన్ని వణికిస్తున్న ఫ్లూ జ్వరాలు

by Sridhar Babu |
వల్లాపురాన్ని వణికిస్తున్న ఫ్లూ జ్వరాలు
X

దిశ, వైరా : దగ్గు, గొంతు నొప్పి, జలుబుతో కూడిన ఫ్లూ జరాలు వైరా మండలంలోని వల్లాపురం గ్రామాన్ని వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఈ గ్రామంలో 300 మందికి పైగా ఫ్లూ జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రతి ఇంటి తలుపును ఫ్లూ జ్వరం తట్టడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే కొన్ని కుటుంబాలు మినహా మిగిలిన కుటుంబాలను ఫ్లూ జ్వరం వేధిస్తోంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో జ్వరం రావడంతో ప్రజలు తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ లక్షణాల వల్ల రాత్రి వేళల్లో అనారోగ్యానికి గురైన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఈ జ్వరం వల్ల గ్రామస్తులకు శ్వాస సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఫ్లూ జ్వరం వచ్చి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఇద్దరిని ఇటీవల ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వల్లాపురాన్ని ఫ్లూ జ్వరం వేధిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో కనీస చలనం కరువైంది. గ్రామంలో అత్యధికంగా జ్వర పీడితులు ఉన్నా...ఆశా వర్కర్లు వైద్యాధికారులకు సమాచారం పూర్తిస్థాయిలో అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జ్వరాల బారిన పడినవారు తమంత తాముగా గొల్లపూడితో పాటు వైరాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స చేయించుకొని తమ ఇళ్లకు వెళ్లి బెడ్ రెస్ట్ లో ఉంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి వల్లాపురంలో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed