కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

by Disha Web Desk 15 |
కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వైరా : ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో సహా వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్(36), అతని భార్య(34) సుజాత చిన్న కుమారుడు అశ్రీత్ శ్రీరామ్ (8) అక్కడిఅక్కడే మృతిచెందారు. రాజేష్, సుజాత దంపతుల మరో కుమారుడు దివిజిత్ శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఉన్న లారెస్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఎకౌంటు విభాగంలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే రాజేష్ కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు తన సొంత గ్రామం వైరా మండలంలోని విప్పలమడకకు గురువారం రాత్రి హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి తమ సొంత కారులో బయలుదేరాడు.

వీరు ప్రయాణిస్తున్న కారు కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది. కొణిజర్లలోని ప్రధాన సెంటర్ కు సమీపంలో జాతీయ రహదారిపై ఖమ్మం నుంచి వైరా వస్తున్న ట్యాంకర్ లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిపి వేశారు. ఈ ట్యాంకర్ నిలిపిన ప్రదేశంలో వైరా వైపు నుంచి ఎదురుగా వాహనాలు పాస్ అవుతుండటంతో ఖమ్మం నుంచి వైరా వస్తున్న మరో లారీ ఈ ట్యాంకర్ వెనుక నిలిపివేశారు. ఈ లారీ వెనుక వస్తున్న రాజేష్ తన కారును స్లో చేశాడు. అయితే రాజేష్ కారు వెనుక వస్తున్న మరో లారీ రాజేష్ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ముందు వెనుక రెండు లారీల మధ్య కారు ఇరక్కపోయి నుజ్జునుజ్జు అయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాజేష్, సుజాత దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు అశ్రీత్ శ్రీరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దంపతుల పెద్ద కుమారుడు దివిజిత్ శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన అశ్రీత్ శ్రీరామ్ హైదరాబాద్ ప్రగతినగర్ లో ఉన్న ప్రగతి స్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4వ తరగతి చదవనున్నాడు.

అదేవిధంగా తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దివిజిత్ శ్రీరామ్ ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతి చదవనున్నాడు. స్థానికులు, పోలీసులు సుమారు గంట పైగా శ్రమించి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన కారును బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సురేష్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో విప్పలమడక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కొణిజర్ల ఎస్సై శంకర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతులకు పలువురి నివాళి

కొనణిజర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులకు పలు రాజకీయ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా విప్పలమడక గ్రామంలో కాంగ్రెస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ మాలోత్ రాందాస్ నాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయురాలు బానోత్ విజయభాయి, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి ), పసుపులేటి మోహన్రావు, విప్పలమడక సర్పంచ్ తుమ్మల జాను పాపయ్య, దార్న రాజశేఖర్, పణతి సైదులు, లారెస్ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కొమ్మినేని సతీష్, హెచ్ఆర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాఘవ తదితరులు మృదేహాలను సందర్శించి పూలమాలవేసి ఘన నివాళ్ళులు అర్పించారు.


Next Story