ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్న పోడు రైతులు.. పురుగుమందు డబ్బాలతో ధర్నా

by Dishafeatures2 |
ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్న పోడు రైతులు.. పురుగుమందు డబ్బాలతో ధర్నా
X

దిశ, అశ్వారావుపేట: నిత్యం అటవీ శాఖ అధికారులకు పోడు సాగుదారులకు మధ్య వివాదం చోటు చేసుకుంటుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సరైన చర్యలు కానీ ఓ క్లారిటీ లేకుండా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. 2005 నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి వెళ్లనివ్వకుండా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని.. అప్పులు తెచ్చి వేసిన పంట నాశనం అయిపోతున్న కనికరం చూపడంలేదంటూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామంలో ఆదివారం ఉదయం ఫారెస్ట్ సిబ్బందిని పోడు సాగుదారులు అడ్డుకున్నారు.

రోడ్డుపై అడ్డంగా బైఠాయించి ఆందోళన దిగారు. మహిళలు చిన్నారులతో సహా పురుగుమందు డబ్బాలతో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాండ్లగూడెం గ్రామ సమీపంలోని పోడు సాగు చేసుకుంటున్న పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసుకోవడానికి రైతులను వెళ్లనివ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లనివ్వకుండా అటవీశాఖ అధికారులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. గాండ్లగూడెం పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గాండ్లగూడెంలో పోడు రైతులకు అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పొడు వివాదంలో ఓ క్లారిటీ లేకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఇదే విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని పోడు సాగుదారులు వాపోతున్నారు. నాశనమైపోతున్న పంటపై ఎరువులు పురుగు మందులు స్ప్రే చేసుకోవడానికి వెళ్ళనివ్వకపోతే చావే శరణ్యమని పురుగుమందు డబ్బాలు చూపుతూ మహిళలు హెచ్చరిస్తున్నారు.

జీవో 140 ద్వారా పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపుతామన్న ప్రభుత్వ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. ఫారెస్ట్ శాఖ సిబ్బంది తీరులో మార్పు లేకపోవడమే పోడు సాగు దారుల్లో నెలకొన్న భయాందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. దీంతో తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ టెంట్ వేసి పురుగుల మందు డబ్బాలతో గాండ్లగూడెంలో నిరసన కొనసాగిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2005 నుంచి సాగులో ఉన్న భూములకు వెళ్లనివ్వకుండా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంలో స్థానిక రాజకీయాలే కారణమని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Next Story