‘ఒలింపియాడ్’ బాదుడు

by Mahesh |
‘ఒలింపియాడ్’ బాదుడు
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల రూపంలో పేరెంట్స్ నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతుంటే.. ఒలింపియాడ్ పరీక్షల పేరుతో మరో బాదుడుకు కొన్ని సంస్థలు శ్రీకారం చుట్టాయి. స్కూలు ఫీజులకే తల్లిదండ్రుల సతమతం అవుతుంటే ఈ అదనపు బాదుడు ఏంటా అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. చిన్నారుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి బాగా చదివించాలనుకోవడం సహజం. మంచి స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు చెల్లించడం సహజం. అయితే పేరెంట్స్ బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు వివిధ సంస్థలు ఒలింపియాడ్ ల పేరిట అదనపు బాదుడుకు శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థలకు ఆయా ప్రైవేట్ పాఠశాలలు కమీషన్లు దండుకుని వంతపాడుతూ.. తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయి. అకాడమిక్ ప్రారంభమవుతున్న ఈ సమయంలోనే స్కూల్ ఫీజు, యూనిఫాం ఫీజు, ఎగ్జామ్ ఫీజు, టై, బెల్ట్, బ్యాడ్జ్ ఫీ, మెటీరియల్ ఫీతో పాటు.. ఈ ఒలింపియాడ్ ఫీజును కూడా కలిపి వసూలు చేయడం విశేషం.

అర్హతలేంటి? ప్రయోజనాలేంటి?

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందలాది స్కూళ్లు ఉన్నాయి. ప్రతి ఏటా మరికొన్ని కొత్తగా ఏర్పాటవుతున్నాయి. వీటి అనుమతులు, మౌలిక సదుపాయాల విషయం పక్కన పెడితే.. ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విషయంలో ఏ అధికారికి పట్టింపులేదు. పేరెంట్స్ నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. వీటికి తోడు ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణ పేరిట అదనపు బాదుడు. ఇంతకీ ఈ ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం లేదా విద్యాశాఖ ఎలాంటి అనుమతిచ్చింది.? అధికారులు ఈ పరీక్షలపై ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు?ఈ పరీక్షల వల్ల చిన్నారులకు వచ్చే ప్రయోజనం ఏంటి? కొన్ని స్కూళ్లు ఈ పరీక్షలను తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? వారిచ్చే ధ్రువీకరణ పత్రాలు దేనికైనా గ్యారెంటీ ఇస్తాయా? అన్నది జిల్లాలోని విద్యాశాఖ అధికారులకే తెలియాలి. ఒక్కో చిన్నారి నుంచి సంవత్సరానికి రెండు వేల రూపాయలు వసూలు చేయడం.. అందులో సగం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యానికి చెల్లించడం విస్మయం గొలుపుతుంది. అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అత్యున్నతస్థాయి విద్యను అందిస్తామని చెబుతున్నప్పుడు ఈ ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణ దేనికన్నది తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రశ్నలు.

మీకింత.. మాకింత..

ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించే సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా తమ బ్రాంచ్ లను విస్తరించుకున్నాయి. జిల్లాల వారీగా మనుషులను నియమించుకుని ఈ దందాకు తెరలేపాయి. ఎంచుకున్న పాఠశాలలో ముందుగా యాజమాన్యాన్ని సంప్రదించి కమీషన్ల రూపేణా ఒప్పందం కుదుర్చుకుని, అందులో విద్యాశాఖ అధికారులను కూడా భాగం చేసి పంపకాలు చేస్తున్నాయి. మీకింత, మాకింత అంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణ తర్వాత పిల్లలకు రాజకీయ నాయకులు లేదా ముఖ్య అధికారులతో సర్టిఫికెట్లు ఇప్పిస్తాం.. పాఠశాల అభ్యున్నతికి సంస్థ ద్వారా తోడ్పాటు అందిస్తాము అంటూ నమ్మబలుకుతూ బుట్టలో వేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా పరీక్షలు నిర్వహిస్తూ అకడమిక్ ప్రారంభంలోనే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.

కలర్ ఫుల్ బ్రోచర్లతో మార్కెట్ లోకి..

కొన్ని విద్యాసంస్థలతో కుమ్మక్కయిన ఒలింపియాడ్ సంస్థలు అందమైన కలర్ ఫుల్ బ్రోచర్లతో ఆకర్షనీయమైన ప్రింటింగ్ తో తయారుచేయించి పేరెంట్స్ ను మభ్యపెడుతున్నాయి. బ్రోచర్లలో కొన్ని లోగోలు, పిల్లల బొమ్మలు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలు, వివిధ బ్రాంచులు, ధ్రువీకరణ పత్రాల బహూకరణ చిత్రాలు, రాజకీయ నాయకులు, అధికారుల ఫోటోలు ముద్రించి కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతి ఏటా ఇంత జరుగుతున్నా, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న విద్యాశాఖ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఎంక్వైరీలు, విజిట్లు అంటూ అధికారులు కాలం వెల్లదీయడం విస్మయం గొలుపుతుంది.

వారితోనే ఆవిష్కరణలు..

పోస్టర్ల ఆవిష్కరణకు కూడా ఈ సంస్థలు కొత్త దారులు వెతుక్కున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆవిష్కరిస్తే అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ఏమీ అనరనే భరోసాతో వారికే ప్రియారిటీ ఇస్తున్నాయి. తమకు వారు తెలుసు.. వీరు తెలుసు అంటూ ధమ్కీ ఇస్తున్నాయి. పిల్లల విద్యాభివృద్ధి కోసం సేవ చేస్తున్నామంటూ మోసం చేస్తున్నాయి. మరోమారు మాట్లాడకుండా విద్యాసంస్థలను కమీషన్ల రూపంలో, తల్లిదండ్రులకు గొప్ప పరీక్షలంటూ కలరింగ్ ఇవ్వడం ద్వారా తమ దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. అధిక ఫీజులతో సతమతమవుతున్న తమకు ఉపయోగం లేని ఈ పరీక్షల ద్వారా మరింత ఆర్థిక భారం పడుతున్నదని, విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో ఉన్నతాధికారులను కలిసి ఈ తతంగంపై వివరిస్తామని, జిల్లాలోని మంత్రులకు సైతం ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఒలింపియాడ్ పరీక్షల నిర్వహణ, జిల్లాలో ఈ సంస్థల నిర్వహణ తీరు, విద్యాశాఖ నుంచి ఇచ్చిన అనుమతుల గురించి తెలుసుకునేందుకు డీఈఓకు స్కూల్ అవర్స్ కాని సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఖమ్మం ఎంఈఓకు ఫోన్ చేసినా ఇదే పరిస్థితి.!Next Story

Most Viewed