ఆర్టీసీలో ఎన్నికలు...సన్నద్ధమవుతున్న యూనియన్లు !

by velandi.Saikiran |   (  Updated:2026-06-09 20:01:12  IST  )

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎనిమిదేళ్ల తర్వాత రంగం సిద్ధం చేస్తోంది.

ఆర్టీసీలో ఎన్నికలు...సన్నద్ధమవుతున్న యూనియన్లు  !
X

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎనిమిదేళ్ల తర్వాత రంగం సిద్ధం చేస్తోంది. ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలను ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. 2018లో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణను కొలిక్కి తీసుకువచ్చింది. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో మూడువేల మంది ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలిచేందుకు పలు యూనియన్లు సన్నద్దమవుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ ఖమ్మం రీజియన్‌లో మాత్రం ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌పట్టు నిలుపుకుంటొంది. ఆర్టీసీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లలో 51శాతం ఓట్లు ఎవరికి వస్తే వారు రాష్ట్రస్థాయిలో ప్రాతినిథ్య గుర్తింపు సంఘంగా గుర్తిస్తారు. దిశ, కొత్తగూడెం ప్రతినిధి

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : ఎనిమిదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపే సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇటీవల ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నియమిస్తూ కార్మికశాఖ కమిషనర్ కు లేఖరాసింది. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు చేస్తున్న డిమాండ్‌కు తలొగ్గి ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఆర్టీసీ డిపోలలో ఎన్నికల అంశం చర్చ జోరుగా జరుగుతోంది. గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలిచేందుకుప కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, హక్కుల కోసం తాము చేసిన ఉద్యమాల ప్రస్తావనపై స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్ డబ్ల్యూఎఫ్), ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు వివరిస్తున్నారు.

ఎనిమిదేళ్ళ తర్వాత నిర్వహణ

ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. 2018లో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్మిక యూనియన్ల గుర్తింపు రద్దు చేయడంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత యూనియన్లు అనేక ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఆర్టీసీ యూనియన్ నాయకులు పలుమార్లు ప్రభుత్వం కలవడంతో పాటు విలీన ప్రక్రియ కూడా చేపట్టాలని నిరసన, ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసిన సంధర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణను కొలిక్కి తీసుకువచ్చింది.

ఏడు డిపోలలో మూడు వేల మంది ఓటర్లు

ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందులలో సుమారు మూడువేల మంది ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. గతంలో ఆరు -డిపోలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 2023లో ఇల్లెందును నూతన డిపోగా ఏర్పాటు చేసి కార్యాకలాపాలను ప్రారంభించింది. దీంతో రీజియన్లో మొత్తం ఏడు డిపోలలో సుమారు 3010ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఖమ్మం, సత్తుపల్లి, మధిర పరిధిలో మొత్తం 2100 ఓట్లు ఉండగా, కొత్తగూడెం డిపో పరిధిలో సుమారు 199, భద్రాచలం 355, మణుగూరు 240, ఇల్లెందులో 120 మంది ఓటు హక్కు కలిగి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

గతంలో ఎస్ డబ్ల్యూఎఫ్ దే హవా

ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ ఖమ్మం రీజియన్‌లో మాత్రం ఎస్‌డబ్ల్యూ ఎఫ్ పట్టు నిలుపుకుంటుంది. ఉద్యమ సమయంలో ఏర్పడిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మినహాయించి మెజారిటీ డిపోలను కైవసం చేసుకొని రాష్ట్ర స్థాయిలో ప్రాతినిథ్య గుర్తింపు సంఘంగా గుర్తింపబడింది. కానీ ఖమ్మం రీజియన్‌లో మాత్రం ఒక్క భద్రాచలం (టీఎంయూ)ను మినహాయించి అన్నీ డిపోలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ హవా చాటింది. అయితే గుర్తింపు సంఘం ఎన్నికలలో రాష్ట్రస్థాయిలో (క్లాజ్-3), రీజియన్ స్థాయిలో (క్లాజ్-6) ప్రకారం ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లలో 51శాతం ఓట్లు ఎవరికి వస్తే వారు రాష్ట్రస్థాయిలో ప్రాతినిథ్య గుర్తింపు సంఘంగా గుర్తింపబడుతుంది.

యూనియన్ ల ప్రధాన డిమాండ్ ఇవే

ఆర్టీసీ ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ‘అపాయింట్ డే’ ను ప్రకటించాలని, ఉద్యోగ భద్రత, అపరిమిత వైద్యసహాయం, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే కేటాయించాలని, కార్మికుల పనిభారం, ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలని, హైదరాబాద్లోని తార్నాక ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగంలో చేరిన వారిని రెగ్యులర్ బేసిస్ గా పరిగణించాలని, యూనియన్ నాయకుల ప్రధాన డిమాండ్ల తో ఎన్నికలబరిలో ఉంటామని నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు జరిగితేనే కార్మికులు తమ సమయాలను పరిష్కరించేందుకు ప్రాతినిధ్య గుర్తింపు సంఘం నాయకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికలు జరిపించాలని యూనియన్ నాయకులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story