ఖమ్మంకు మత్తు మరక.. జిల్లాలో కేపీ చౌదరి పరిచయాలపై ఆరా..

by samatah |
ఖమ్మంకు మత్తు మరక.. జిల్లాలో కేపీ చౌదరి పరిచయాలపై ఆరా..
X

దిశ ఖమ్మం సిటీ: రాష్ట్ర రాజధానిలో కలకలం రేపుతున్న డ్రగ్స్ మూలాలు ఖమ్మం నగరంలో వేళ్లూనుకున్నాయా.. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి స్వస్థలం ఖమ్మం జిల్లా కావడంతో డ్రగ్స్ సరఫరా లింకులపై రాష్ట్ర పోలీసులు ఈ దిశగా అన్వేషణ చేపట్టారు. జిల్లాలో కొందరు ప్రముఖులతో ఉన్న పరిచయాలు విస్తృతంగా ఉపయోగించుకొని, తమ సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు ఉన్నతాధికారుల అండతో మాదక ద్రవ్యాల దందాను గుట్టుగా కొనసాగిస్తున్న ఈ వ్యాపారం కాస్త రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ఇదే జిల్లాతో పెనవేసుకున్న పరిచయాలపై ఇప్పటికే నార్కోట్రిక్ బ్యూరో అధికారులు కూడా ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది. అంతేకాక పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసినట్లు సమాచారం.

డ్రగ్స్ తరలిస్తూ సినీ నిర్మాత కేపీ చౌదరి హైదరాబాద్ మాదకద్రవ్యాల నిరోధక బృందానికి అడ్డంగా దొరికిపోయారు. కేపీ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ ప్రాంతం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలోనూ కొంత కాలం వ్యాపారం నిర్వహించిన చౌదరి, ఆ తర్వాత ఖమ్మం పట్టణం, హైదరాబాద్ నగరంలోనూ అనేక వ్యాపారాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఆరు తర్వాత ఆయన డ్రగ్స్ పెడలర్స్‌గా మారినట్లు పోలీసుల తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో హైదరాబాదు టాస్క్‌ఫోర్స్ పోలీసుల నజర్ ఖమ్మం వైపు మళ్లింది. దీనికి కారణం కేపీ చౌదరి హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత ఖమ్మం నగరంలో నిత్యం అనేక కార్యక్రమాలతో, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక టాలీవుడ్ సినిమా ప్రమోషన్లనూ జరపడం, ఈ కారణాలతో జిల్లా వ్యాప్తంగా పలువురు రియల్ ఎస్టేట్, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడం, అనేక కార్యక్రమాలకు ప్రముఖులతో సహా, పోలీసు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడం, ఆ పరిచయాలను వాడుకుని జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను సులభం చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారనీ సమాచారం. అంతేకాక చౌదరి స్వయంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వ్యక్తి కావడంతో ఆ దిశగా సైతం ఇండస్ట్రీలో లింకులనూ వెతికే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది.

ఖమ్మం జిల్లాలో కొందరు వ్యక్తులకు సినీ పరిశ్రమతో సత్సంబంధాలు ఉండటం, ఆ వ్యక్తులు అధికార పార్టీతో అంటకాగడంతో అందరి దృష్టి ఖమ్మంపై పడింది. నాలుగేళ్ల నుంచి ఏ పెద్ద కార్యక్రమం జరిగినా సెలెబ్రిటీలను ఆహ్వానించడం జిల్లా లో సర్వ సాధారణంగా మారింది. కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన చౌదరి గోవా నుంచి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌదరితో సత్సంబంధాలు ఉన్న ఖమ్మం బ్యాచ్ లావాదేవీలు, ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలించేందుకు ఓ బృందం రంగంలోకి దిగాయి. డ్రగ్స్‌తో పాటు విదేశాలకు అమ్మాయిల తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరినట్లు తెలుస్తున్నది. డ్రగ్స్ తో పాటు, అమ్మాయిల తరలింపు లింకులు కూడా హైదరాబాదు, ఖమ్మం ప్రాంతాలకే కనెక్ట్ అవుతున్నవని పోలీసులు అవగాహన కొచ్చారు. కొందరు బడా బాబులు అదే పనిలో అందెవేసిన వారిగా కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. చౌదరి సప్లై వెనక ఉన్న కోణాలలో తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళన జిల్లాలో కొందరిలో మొదలైనట్లు ప్రచారం ఊపందుకుంది. అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదగడం అంటే ఈ తరహ దందాలు చేస్తేనే సాధ్యం అని, చౌదరితో అనుబంధం ఉన్న వారు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న చీకటి వ్యాపారాల్లో ఎవరు దాగి ఉన్నారనే విషయంలో పోలీసులు కూపీ లాగితే డొంక కదలవచ్చు. కానీ ఖమ్మంలో ఉన్న కొందరు పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాలు ఈ విచారణలో అడ్డంకులు సృష్టిస్తాయా అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుల్లో మెదులుతున్నాయి.



Next Story

Most Viewed