దిశ ఎఫెక్ట్ ...సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫస్ట్ వికెట్ డౌన్... వైరా రిజిస్ట్రార్ విధుల నుంచి తొలగింపు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్ ...సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫస్ట్ వికెట్ డౌన్... వైరా రిజిస్ట్రార్  విధుల నుంచి తొలగింపు
X

దిశ, వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ గౌతమ్ సిద్ధమయ్యారు. చర్యల్లో భాగంగా ముందుగా వైరా సబ్ రిజిస్ట్రార్ రామ్ కుమార్ ను వైరా విధుల నుంచి తొలగించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కొనిజర్ల మండలం దుద్దుపూడి గ్రామం సర్వే నెంబర్ 49 లో కోర్టు వివాదంలో ఉన్న భూమిని వైరా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా వైరా మండలం సోమవారం గ్రామంలో అసైన్మెంట్ భూమి 1100 గజాలను ఓ మహిళకు రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా డీటీసీపీ అనుమతి లేని పలు ప్లాట్లను ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై దిశ దినపత్రికలో పలు వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ అక్రమాలకు పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే వైరా సబ్ రిజిస్ట్రార్ విధుల నుంచి రామ్ కుమార్ ను తొలగించారు. ఆయన స్థానంలో ఇక్కడ పనిచేసే ఓ అధికారిణి కి తాత్కాలిక సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు. 2022 మే నెలలో రామ్ కుమార్ వైరా సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఎనిమిది నెలల కాలం పనిచేసిన ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలన్నింటినీ దిశ సమగ్రంగా కథనాల రూపంలో ప్రచురించింది. ప్రస్తుతం రామ్ కుమార్ ను ఖమ్మం డిస్టిక్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు పంపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయనపై పూర్తిస్థాయిలో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే డీటీసీపీ అనుమతి లేకుండా 2021 జూన్ నెల నుంచి 2022 డిసెంబర్ నెల వరకు అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిని రామ్ కుమార్ తో పాటు అప్పట్లో ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్లు కృష్ణయ్య, సత్యానందం కూడా వందలాది రిజిస్ట్రేషన్ చేశారు. వారిపై కూడా సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.



Next Story