నాసిరకంగా అభివృద్ధి పనులు.. కోట్ల ప్రజాధనం వృథా

by Web Desk |
నాసిరకంగా అభివృద్ధి పనులు.. కోట్ల ప్రజాధనం వృథా
X

దిశ, కారేపల్లి: నిర్మాణాల్లో నాణ్యత లోపించి మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు పర్సంటేజీల కోసం పాకులాడుతుంటే గుత్తేదారులు, అధికారులు తమ పని తాము కానిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవడమే కాకుండా అభివృద్ధి ఫలాలను అనుభవించాల్సిన ప్రజలు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అన్నీ నాణ్యత లేని నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. మండలం కొమ్ముగూడెం స్జేజీ నుంచి ముత్యాలగూడెం వరకు ఎస్‌డీఎఫ్‌సీ నిధులు రూ. 2.40 కోట్లతో వేసిన రోడ్డు పూర్తిగా నాసిరకంగా దర్శనమిస్తోంది. పనులు చేసిన గుత్తేదారు నాణ్యతకు తిలోదకాలు వదిలేశారు.

అదుపు తప్పితే అంతే..

ముత్యాల గూడెం చెరువు వద్ద బీటీ రోడ్డు ఇరువైపుల షోల్డర్లు లేక బీటీ ధ్వంసం అవుతోంది. దీంతో ముత్యాల గూడెం చెరువు కట్టపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయ పడుతున్నారు. ఈ రహదారి మీదనే రైతుల అరకలు, బండ్లు, ట్రాక్టర్లతో పాటు ఎర్రబోడు, మాణిక్యారం, గుడితండా, చీమలపాడు, రేలకాయలపల్లి, పాటిమీదిగుంపు, నానునగర్ తండాల వంటి 15 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. చెరువు కట్ట అరకిలోమీటరు దూరంలో ఎదురు వాహనం వస్తే అంతే సంగతులు.. ఒకవేళ అదుపుతప్పితే ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. నల్లూడి చెరువు సమీపంలోని కాజువే వంతెన వద్ద రోడ్డు ఇరువైపుల గ్రావెల్‌ కుంగి పోయి గుంటలు పడింది. చెరువు కట్టపై ఇరువైపుల షోల్డర్లు వేయకపోవటం, గ్రావెల్‌ పోయక పోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

ఫిర్యాదు చేసినా చర్యలేవి..?

అప్పటి వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సిపార్సుతో ఎస్‌డీఎఫ్‌సీ నిధులు రూ. 2.40 కోట్లు మంజూరు కాగా, ఆ నిధులతో చేపట్టాల్సిన పనులు ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ హయాంలో నాసిరకంగా సాగాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బానోత్ మదన్ లాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో స్పందించి విచారించిన ఈఈ రోడ్డు నాణ్యతపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విచారకరం.

అన్ని పనులూ అంతే..

కారేపల్లి మండలంలోనే కాకుండా వైరా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గిరిజన గ్రామాలు, పల్లెలను అభివృద్ధి బాట పట్టించాలని ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుంటే నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మాత్రం పర్సెంటీజీలు తీసుకుంటూ పనులను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం మామూళ్లు తీసుకోవడంతో పనులు చేస్తున్న గుత్తేదారులదే రాజ్యంగా నడుస్తోంది. కారేపల్లి మండలం పాటిమీదిగుంపు నుంచి వయా నానునగర్‌తండా మీదుగా స్టేషన్‌ చీమలపాడుకు రోడ్డును ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి ఇటీవలే నిర్మించారు. రెండు వారాలు కాకముందే అది పగుళ్లు రావడం, గుంతలు పడడంతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అధికారులు, గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. దీనిని బట్టి నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని ప్రజలు చెబుతున్నారు.

Next Story