- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అలంకారప్రాయంగా మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు

దిశ, ఏన్కూర్ : వేసవి కాలం వచ్చింది. నెల గడిచింది. తాగునీటి సమస్య ఎక్కడ రాకూడదని జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్ లో జిల్లా అధికారులకు చెప్పడం కూడా జరిగింది. తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను ఆర్డబ్ల్యూఎస్, గ్రిడ్ అధికారులు సమన్వయంతో పరిస్థితిని ముందే చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నా అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోవడంతో మరసకుంట, సూర్య తండా గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామని హామీ ఇచ్చిన మేరకు రెండు గ్రామాల్లో ఓవర్ హెడ్ మంచి నీటి ట్యాంకులను నిర్మించారు. సుమారు ఐదు సంవత్సరాలు అవుతున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా గ్రామస్తులకు చుక్కనీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. అధికారుల అలసత్వం వల్ల గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకి జటిలమవుతుంది. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డైరెక్ట్ పంపింగ్ ద్వారా ఏదో నామమాత్రంగా త్రాగునీరు అందిస్తున్నప్పటికీ అవి గ్రామస్తులకు పూర్తిస్థాయిలో సరిపోవట్లేదు. సూర్య తండా గ్రామంలో గిరిజన కుటుంబాలే ఎక్కువ. ఈ గ్రామంలోని నివసించే గిరిజనులు వ్యవసాయం ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ప్రతిరోజు ఉదయమే పొలం పనికి వెళ్లి వచ్చేవరకు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. సమస్య పెద్దదైనప్పటికీ అధికారులు చలనం మాత్రం ఏ మాత్రం కనబడట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఓ పొలంలో ఉన్న మోటార్ ద్వారా గ్రామంలో ఆడపా తడప నీళ్లు ఇస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదు అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామీణ నీటి సరఫరా అధికారులు. మిషన్ గ్రిడ్ అధికారులు స్పందించి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వారానికి ఒక్కసారి వస్తాయి నీళ్లు.. రాంబాబు, సూర్య తండా గ్రామస్తుడు
గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం శూన్యం. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇచ్చే నీటి సరఫరా అంతంత మాత్రమే. మా గ్రామంలో మంచినీళ్ల సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది. అధికారులకు తెలిసినా కూడా స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వేసవి కాలం మంచినీటి సమస్య బాగా ఉంది. అధికారులు పరిష్కరించాలి.
ట్యాంకు కట్టి ఏళ్లు గడుస్తుంది.. చుక్క నీళ్ళు ఇవ్వలేదు : వెంకటేశ్వర్లు మరుసుకుంట గ్రామస్తుడు
గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఏళ్లు గడుస్తున్నా ఆ ట్యాంకు ద్వారా నీళ్లు మాత్రం ఇవ్వలేదు. ఆ ట్యాంకు ఎందుకు కట్టారో ఇప్పటికీ మాకు అర్థం కాదు. అధికారులు తీసుకునే చర్యల వల్ల గ్రామంలో మేము తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా మంచినీళ్లు అందించాలి .