ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో సీపీఐ ప్రచార జాతా

by Disha Web Desk 15 |
ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో సీపీఐ ప్రచార జాతా
X

దిశ, వైరా : దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఖమ్మం జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు స్పష్టం చేశారు. వైరా లోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రచార జాతా ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో కొనసాగుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు చర్యలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజాస్వామ్యక విలువలు కాపాడేందుకు మోడీ హఠావో.... దేశీ బచావో నినాదంతో ఈ ప్రచార జాతాను నిర్వహిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి నెలరోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి నిర్ణయం మేరకే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మోడీ ఆ హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే పరమావధిగామారాయని ఆరోపించారు. బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమని, వ్యతిరేక శక్తులను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు.

మునుగోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ తో కలిసి పనిచేయటం వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం ఐక్యంగా రాబోయే ఎన్నికలు కలిసి పోటీ చేయాలని, ఒకరి మధ్య మరొకరు పరస్పర అవగాహనతో ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర శాసనసభకు వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం సంపాదించేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టులకు కందాల భేషరతుగా క్షమాపణ చెప్పాలి

గత ఎన్నికల్లో కమ్యూనిస్టు ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం కమ్యూనిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి కి పొత్తుల్లో భాగంగా సీపీఐ ఓటర్లు తమ ఓటును వేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులను విమర్శించిన ఉపేందర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపేందర్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఉపేందర్ రెడ్డి తీరు ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డుకు చేరిన తరవాత బోడ మల్లయ్యగా ఉందని ఏద్దేవా చేశారు.

పాలేరులో నిర్వహించిన పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని అనుచిత వ్యాఖ్యలు చేసిన కందాల ఉపేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపేందర్ రెడ్డి తండ్రి గతంలో సీపీఐలోనే కొనసాగారని, గత ఎన్నికల్లో ఆ ఓట్లతోనే గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రబాబు, జిల్లా నాయకులు దొండపాటి రమేష్, మండల కార్యదర్శి యామాల గోపాలరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story