అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి.. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు

by Vinod kumar |
అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి.. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు
X

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో హైవేకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నాటి నుండి హైవే కు ఆనుకుని ఎలాంటి ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వ అధికారులు హెచ్చరించినప్పటికీ.. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా అడుగు ముందుకు వేసి.. ఆ నిర్మాణం మొత్తం కూడా డివియేషన్‌కు లోబడి నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఇంటి నిర్మాణం ఒక ప్రముఖ వైద్యుడు నిర్మించ తల పెట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధాన రహదారి వెంబడి నిర్మించే ఇంటికి సుమారు ఇంటి మూడు నుండి పది మీటర్ల వరకు దూరం కేటాయించాల్సి ఉంది. కానీ, అందుకు భిన్నంగా నిర్మించిన.. కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కార్పొరేషన్ అధికారులను అడిగిన ఆ ఇంటికి ఇంటి నెంబర్ లేనందున సమాచారం ఇవ్వలేకపోతున్నామని చేతులు దులుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడమే కాక అనుమతి ఒకలా తీసుకొని మరొక విధంగా నిర్మించారు. అధికార పార్టీ అండతో ఎవరిని లెక్క చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


కనీసం గ్రౌండ్‌తో సహా 5 అంతస్తులు కట్టిన వారికి మాత్రమే సెల్లార్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదేమి లేకుండా సెల్లార్‌ని కలుపుకొని ఐదు అంతస్తులు నిర్మించారు. బిల్డింగ్ నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో లేకుండా వెనకాల ఉన్న ఒక గెస్ట్ హౌస్ స్థలాన్ని కూడా ఆక్రమించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ స్థల విషయం వివాదంలో ఉన్నప్పటికీ అక్కడి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి చేతులు దులుపుకునే పద్ధతిలో నిర్వాహకుడు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంటిపై అనుమతి తీసుకోకుండానే మరొక పెంట్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది.

ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కుమార్ ని 'దిశ' ప్రతినిధి వివరణ కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఇంటికి సంబంధించిన అనుమతులు గతంలోని తీసుకున్నారని తను వచ్చిన తర్వాత ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులను పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. అదేవిధంగా హైవేకు వెంబడి నిర్మించే నిర్మాణాలు మూడు నుంచి పది మీటర్ల దూరంలో చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే తమకు వచ్చిన సమాచారం మేరకు ఇంటి యజమాని నుండి వివరాలు తెలుసుకునేందుకు తమ సిబ్బందిని పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Next Story

Most Viewed