కాంగ్రెస్ చేసింది శూన్యం

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ చేసింది శూన్యం
X

దిశ, ఖమ్మం టౌన్ : దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి చేసింది శూన్యమని, నరేంద్ర మోడీతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పేదరికం నిర్మూలిస్తామని నెహ్రూ, ఇందిర, రాజీవ్ చెబుతూ వచ్చినా ఏమీ చేయలేకపోయారని, మోడీ గత పదేళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖకు ఎగువకు తెచ్చారని అన్నారు. ఖమ్మం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ వేసిన సందర్భంగా ఖమ్మం పట్టణంలో శుక్రవారం జరిగిన భారీ రోడ్ షో లో పాల్గొని రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వివిధ కళా రూపాల ప్రదర్శన నడుమ జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నినాదాలతో ఖమ్మం పట్టణం హోరెత్తింది. సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రత్యేక చాపర్లో సికింద్రాబాద్ నుంచి వచ్చిన రాజ్ నాథ్ కు వినోద్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ,

రంగా కిరణ్, ప్రభారి శ్రీకాంత్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాకారుల సందడి మధ్య ఎండలోనే రోడ్ షో సాగింది. పూలతో ముస్తాబైన ప్రచార రథం పైనుంచి నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ సెంటర్ లో అశేష జనవహినినుద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, అలాంటి చెడ్డ ప్రభుత్వాన్ని ఇంటికి పంపినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అవినీతి, కుంభకోణాల విషయంలో బీఅర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని చెప్పారు. పదేళ్ల మోడీ పాలనలో ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేరని అన్నారు. మోడీది చెప్పింది చేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. 370 అధికరణను, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తామని మాటిచ్చి ఆ పనులు చేశామని, అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని చెప్పి నిర్మించామని ఆయన గుర్తుచేశారు. తాజా మానిఫెస్టోలో పేర్కొన్నట్లు ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చితీరుతామని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్ గొప్ప పాత్ర పోషిస్తుందని అన్నారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పై రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. వినోద్ రావు డైనమిక్ అభ్యర్థి అని, సేవా రంగంలో ఆయన కమిట్మెంట్ తిరుగులేనిదని అభినందించారు. వినోద్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కృతజ్ఞతలు చెప్పడానికి మళ్లీ ఖమ్మం వస్తానని ఆయన మాటిచ్చారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ - ఖమ్మం అభివృద్ధి చెందాలంటే ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. బీజేపీ గోల్డెన్ ప్రభుత్వం కావాలో, కాంగ్రెస్ రోల్డ్ గోల్డ్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఢిల్లీలో తల్లీ, కొడుకు,

కూతురు కాంగ్రెస్ ను ఏలుతుంటే, ఖమ్మంలో ఒక డిప్యూటీ సీఎం తన భార్యకు టికెట్ అడుగుతుంటే, ఇద్దరు మంత్రుల్లో ఒకరు తన కుమారుడికి, మరొకాయన తమ్ముడికి టికెట్ కావాలని కోరుతున్నారని చెప్పారు. ఖమ్మం అభివృద్ధి బీజేపీ ఎంపీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. ర్యాలీనుద్దేశించి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో భారత్ ను పరుగులు పెట్టిస్తున్న ఘనత మోడీ దే అన్నారు. వినోద్ రావును మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ రోడ్ షో లో పాల్గొన్నారు.

Next Story