కాంగ్రెస్​ బాండ్​ పేపర్​ బౌన్స్​ అయింది

by Sridhar Babu |
కాంగ్రెస్​ బాండ్​ పేపర్​ బౌన్స్​ అయింది
X

దిశ, ఖమ్మం రూరల్ ​: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారెంటీల బాండ్​ పేపర్​ బౌన్స్​ అయిందని, హామీల అమలు మరిచిన కాంగ్రెస్​ను ఇంటికి పంపించాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్లపైనే ఉందని మాజీ మంత్రి తన్నీరు హరీష్​రావు అన్నారు. శుక్రవారం రూరల్​ మండలం బారుగూడెం వద్ద పాలేరు నియోజకవర్గ ఉమ్మడి వరంగల్​, ఖమ్మం, నల్లగొండ

జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రైతులు పండించిన పంటకు 500 బోనస్​ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే సన్నాలకే ఇస్తామని చెప్పి రైతులకు సున్నం పెట్టిన కాంగ్రెస్​ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలన్నారు. విద్యావంతుడైన ఎనుగల రాకేష్​రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలన్నారు.

నిరుద్యోగుల వాయిస్​ వినిపించాలంటే రాకేష్​రెడ్డిని గెలిపించాలి : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

నిరుద్యోగుల సమస్యలను తీర్చాలంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణవంతుండైన రాకేష్​రెడ్డికి మొదటి ప్రాధన్యత ఓటేసి గెలిపించాలని బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. నిజానికి అబద్దానికి జరుగుతున్న మహా యుద్దం అన్నారు. రిజర్వేషన్​లను రద్దు చేస్తామని చెప్పిన బీజేపీ ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తుందని అన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్క లేదన్నారు. 56 కేసులున్న తీన్మార్​ మల్లన్నను గెలిపిస్తారో.. విద్యావంతుడైన రాకేష్​రెడ్డిని గెలిపిస్తారో గ్రాడ్యుయేట్లు ఆలోచన చేయాలన్నారు.

బ్లాక్ మెయిలర్​ తీన్మార్​ మల్లన్నను ఓడించండి : రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి

బ్లాక్​ మెయిలర్​ తీన్మార్​ మల్లన్నను ఓడించి, సేవ చేస్తున్న రాకేష్​రెడ్డిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి అన్నారు. మంచికి చెడుకు జరుగుతున్న ఈ పోటీల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రైతుబిడ్డ రాకేష్​రెడ్డిని గెలిపించి మండలికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసుదన్​, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్​రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, నాయకులు జీవన్​కుమార్​, బోమ్మెర రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, వీరయ్య, ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీలు ధనలక్ష్మి, ప్రసాద్​, నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story