కలెక్టర్ గారు... హ్యాట్సప్​​

by Sridhar Babu |   ( Updated:2023-03-10 11:03:44.0  )
కలెక్టర్ గారు... హ్యాట్సప్​​
X

దిశ, వైరా : ఆయన ఒక జిల్లాకు బాస్.. ఐఏఎస్ అధికారైనా ఆయన సమస్యలు తెలుసుకునేందుకు తన ఉద్యోగానికి ఉన్న స్థాయిని సైతం పక్కనపెట్టి ప్రతి ఒక్కరితో మమేకమవుతారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడుతారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టేందుకు నిరంతరం ఆ పనులను పర్యవేక్షిస్తుంటారు. తన హోదాను పక్కనపెట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులతో నేలపై కూర్చుని ఓ సామాన్యుడిలా భోజనం చేస్తారు. ఆయన పర్యటనకు వచ్చారంటేనే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు చెమటలు పడతాయి. ఆయనే ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్. వైరా పట్టణంలో శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ 4 గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు.

వైరాలోని బాలికొన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మనబడి పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. బాలికొన్నత పాఠశాలలో అభివృద్ధి పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాలలోని 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థినీలతో మాట్లాడారు. కలెక్టర్ పిల్లలతో కూర్చొని ఇంగ్లీష్ క్లాసును విన్నారు. అనంతరం విద్యార్థినీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మన ఊరి మనబడి లో భాగంగా సదుపాయాలు బాగున్నాయని విద్యార్థినిలు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలోని 4వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వైరాలోని టీఎస్ ఆర్ఎస్ పాఠశాలలో ఆయన పర్యటించారు. ఈ పాఠశాలలోనే ఐదో తరగతి విద్యార్థినీలతో ఆయన ఏకాంతంగా తరగతి గదిలో మాట్లాడారు.

ఆయన ఒక్కరే తరగతి గదిలోకి వెళ్లి పాఠశాలలో విద్యాబోధన, వసతి గృహంలో సమస్యలు, అల్పాహారం, భోజనంలో నాణ్యత ఉంటుందా... లేదా అనే విషయాలను విద్యార్థినులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించి వారిలో వున్న నైపుణ్యాన్ని పరిశీలించారు. అనంతరం టీఎస్ఆర్ఎస్ లో మరో డార్మెటరీ నిర్మాణానికి కలెక్టర్ తన నిధులు నుంచి రూ.20 మంజూరు చేశారు. ఈ పాఠశాల వసతిగృహం స్లాబ్ నుంచి నీరు లీకు అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ భవనంపై మరో డార్మెటరీ నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. డార్మెటరీ నిర్మిస్తే లీకేజీ సమస్య పరిష్కారం కావడంతో పాటు మరో డార్మేట్ విద్యార్థినీలకు అందుబాటులోకి రానుంది. అనంతరం కలెక్టర్ డైనింగ్ హాల్లో విద్యార్థినిలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అదే విధంగా వైరాలో నిర్మాణంలో ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఇండోర్ స్టేడియంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

ఈ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని అధికారులను కాంట్రాక్టర్ కు ఆదేశించారు. వైరాలోని బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ శిబిర నిర్వాహన తీరు, ఇప్పటివరకు ఎంతమందికి కంటి పరీక్షలు నిర్వహించారు... తదితర విషయాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో కలెక్టర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కేంద్రంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని వచ్చిన స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో సోమశేఖర్ శర్మ, జిల్లా వైద్యాధికారి మాలతి, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, కౌన్సిలర్ కన్నెగంటి సునీత, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఈ ఈ నాగ శేషు, వైరా తహసీల్దార్ అరుణ, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఆయా పాఠశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed