వైరాలో వినూత్న నిరసన

by Dishanational1 |
వైరాలో వినూత్న నిరసన
X

దిశ, వైరా: గత 8 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలోని మధ్య తరగతి, నిరుపేద ప్రజలు ఆర్థికంగా బలైపోతున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచటాన్ని నిరసిస్తూ వైరాలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో మధిర క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో ర్యాలీలో పాల్గొని వంట గ్యాస్ సిలిండర్లను తలపై ఎత్తుకుని నిరసన తెలిపారు. అనంతరం మధిర క్రాస్ రోడ్ లో కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్ మాట్లాడుతూ మోడీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కూలి అవుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెడుతుందని ఆరోపించారు. గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మూడు రెట్లు గ్యాస్ ధరలు పెంచి మధ్యతరగతి, నిరుపేద ప్రజలపై తీవ్ర భారం మోపిందన్నారు. కమర్షియల్ గ్యాస్ బండల ధరలు కూడా పెంచడంతో ప్రజలపై పరోక్షంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడంబరాల కోసం ప్రధానమంత్రి మోడీ ధరించే దుస్తులకే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ పాలనలో అంబానీ అదానీలు మాత్రమే కుబేరులయ్యారని చెప్పారు. నిరుపేదలకు మోడీ పాలనలో లబ్ధి జరగకపోగా వారి నడ్డి విరిచేలా నిత్యవసర వస్తువులతో ధరలు పెంపుదలతోపాటు పన్నుల భారాన్ని మోపారని ద్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 2014 సంవత్సరం ముందు గ్యాస్ నిత్యవసర ధరలు పెరిగిన సమయంలో రోడ్డెక్కి ఆందోళన చేసిన స్మృతి ఇరానీ లాంటివాళ్ళు ప్రస్తుతం ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. అప్పట్లో అధికారం కోసం బీజేపీ నాయకులు ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపి దేశ ప్రజలందరినీ మోసం చేశారన్నారు. అధికారం లేనప్పుడు ఒక విధంగా, అధికారం వచ్చాక మరో విధంగా వ్యవహరించడం బీజేపీకే సాధ్యమన్నారు.

దేశంలో మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి పొందుతుందని విమర్శించారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండే దేశ ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి ఆ మంటలతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసం చలి కాగుతుందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు బీఆర్ఎస్ తోపాటు వామపక్షాలు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, సీపీఐ నాయకులు మిట్టపల్లి రాఘవరావు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, విశాఖ కమిటీ సభ్యులు కట్టా కృష్ణర్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Next Story