అట్టహాసంగా సంగమేశ్వరుడి జాతర

by Shiva |
అట్టహాసంగా సంగమేశ్వరుడి జాతర
X

దర్శనానికి పోటేత్తిన భక్తజన సందోహం

దిశ, ఖమ్మం రూరల్: ఓం నమ:శివాయ, హారహర మహాదేవ.. శంభోశంకరా.. అంటూ సంగమేశ్వరుడి ప్రాంగణం మారుమోగింది. మండల పరిధిలోని తీర్థాలలో గల సంగమేశ్వరుడి జాతర శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆలయ ప్రధాన అర్చకుడు విజయశేఖరశర్మ, సంతోష్​శర్మ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి శనివారం జాతరను ప్రారంభించారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి దంపతులు, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ దంపతులు, సీఐ శ్రీనివాసరావు దంపతులు అర్థరాత్రి 12గంటలకు శివుడిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు.

ఆలయ ఈవో శేషయ్య ఎమ్మెల్యే కందాల దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థాల సంగమేశ్వరుడి దర్శనంతో ఆయురారోగ్యాలతో పాటు సిరిసంపదలు సిద్ధిస్తాయి. జాతరకు ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజలు శివయ్యను దర్శించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సారి భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. స్వామి వారిని దర్శించుకున్న వారిలో డీసీపీ సుభాష్​చంద్రబోస్, ట్రాఫీక్ ఏసీపీ రామోజీ రమేష్​, రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాసరావు ఉన్నారు.

తీర్థాల జాతరకు పోటేత్తిన భక్తజనం..

తీర్థాల సంగమేశ్వరుడి జాతరకు శనివారం ఉదయం నుంచి భక్తుల సంఖ్య తాకిడి మొదలైంది. రాత్రి నుంచే ఖమ్మం నగరంతో పాటు ఇతరు ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఎండోమెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్నేరులో సరిపడ నీరు లేకపోవడంతో భక్తులు స్తాన్నాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కుళాయిలు కొంత మేర ఉపయోగపడ్డాయి. తాత్కలిక బాత్​రూం వద్ద నీరు లేకపోవడంతో దుర్గంధంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

అదేవిధంగా శానిటేషన్​ సిబ్బంది ఎంపీవో శ్రీనివాసరావు పర్యవేక్షణో ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు చేపట్టారు. జాతర విజయవంతం అయ్యేలా ఆర్డీవో రవీంధ్రనాథ్, రూరల్ తహసీల్దార్ సుమ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మానిటరింగ్​ చేశారు. స్వామి వారిని ఖమ్మం నగర మేయర్ నీరజ దంపతులు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారయణ దంపతులు, జిల్లా కలెక్టర్​ వీ.పీ.గౌతమ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శివున్ని దర్శించుకున్నారు. అదేవిధంగా కందాల ఫౌండేషన్​ సహకారంతో భక్తుల నిమిత్తం ఏర్పాటు చేసిన మజ్జిగ స్టాల్ ను ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి దంపతులు ప్రారంభించగా, సెవన్​డేస్ అకాడమీ వారు మజ్జిగ పంపిణీ చేసి భక్తుల దాహార్తిని తీర్చారు.

Next Story