అక్రమ మట్టి దందా అడ్డుకున్న ఆర్‌ఐపై దౌర్జన్యం

by Taduka Kalyani |   (  Updated:2026-06-09 12:16:12  IST  )

మండల పరిధిలోని కొత్త తండా గ్రామపంచాయతీ సమీప గుట్ట ప్రాంతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది.

అక్రమ మట్టి దందా అడ్డుకున్న ఆర్‌ఐపై దౌర్జన్యం
X

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని కొత్త తండా గ్రామపంచాయతీ సమీప గుట్ట ప్రాంతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు, తహసీల్దార్ ఆదేశాలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) ఆలీ అక్బర్, జీపీఓ బంపర్, భాస్కర్ తదితర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆర్‌ఐ ప్రయాణిస్తున్న కారు తాళాలను బలవంతంగా లాక్కొని, నువ్వెవడివి? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఘటన స్థలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంటలపాటు నిర్బంధించడంతో పరిస్థితి విషమించడంతో ఆర్‌ఐ ఆలీ అక్బర్ తహసీల్దార్‌కు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆర్‌ఐ ఆలీ అక్బర్ మాట్లాడుతూ.. అక్రమ మట్టి తరలింపు జరుగుతోందన్న సమాచారం మేరకు తాము మాదారం కొత్త తండా ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు కారు తాళాలు లాక్కొని తమను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యే పీఏతో మాట్లాడించారని, కారు తాళాలు లాక్కోవడం సరికాదని తాను చెప్పగా ఎమ్మెల్యే పి.ఏ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అక్రమంగా నడుస్తున్న ట్రాక్టర్లను అక్కడి నుంచి పంపించిన అనంతరం, పోలీసులు చేరుకున్న తర్వాతే తాళాలు తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడడం వంటి అంశాలపై సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్‌ఐ వెల్లడించారు. సహజ వనరుల పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్న అధికారులపైనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story