- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నా కలల పంట
దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నా కలల పంట అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో శనివారం వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాలలో సాగు చేస్తున్న మియాజాకి మామిడి, ఇతర పంటల సాగును పరిశీలించారు. వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్ చేపట్టే సాగు, వినూత్న ప్రయోగాలు గురించి మంత్రికి వివరించారు. తర్వాత సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ 1989లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషిని కొనియడారు. వ్యవసాయంపై తుమ్మల కున్న మక్కువ నిబద్ధతని ప్రశంసించారు.
వ్యవసాయ కళాశాల నా కలల పంట
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల కేవలం విద్యార్థులకు బోధన అందించడం మాత్రమే కాకుండా రైతులకు ఉపయోగపడేలా వినూత్న రీతిలో సాగు చేయు పంటలు, రైతులకు ఆదాయం వచ్చే పంటల సాగు చేపట్టాలన్నారు. అశ్వారావుపేటలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆలోచనలతో ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ రైతాంగాన్ని వ్యవసాయపరంగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిందని, 35 ఏళ్ల ప్రస్థానంలో 2,500 మంది వ్యవసాయ విద్యార్థులు ఇక్కడ నుంచే తయారయ్యారని గుర్తు చేశారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థులు వ్యవసాయ పరమైన రంగాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ అండగా నిలవాలని సూచించారు.
వ్యవసాయ కళాశాల నా చిరకాల కలల పంట అని, ఇతర వ్యవసాయ కళాశాలలకు దీటుగా ఈ కాలేజీని తీర్చిదిద్దడమే తన చిరకాల వాంఛ అని అన్నారు. దీనికోసం కళాశాల పూర్తిస్థాయి అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. పంటలకు ధర రావాలంటే ప్రాసెసింగ్ ప్లాంట్లను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం పామాయిల్ మొక్కల నుంచి బై ప్రొడక్ట్స్ పరిశోధనలు విస్తృతంగా జరగాలని కోరారు. భవిష్యత్తులో కలెక్టర్, ఎస్పీల కంటే వ్యవసాయ రంగంలోనే మంచి అవకాశాలు ఉంటాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం వరి పంటలో నెంబర్ వన్ గా నిలుస్తోందని, ప్రభుత్వం వరి రైతులను మరింతగా ప్రోత్సహిస్తూ ప్రస్తుతం బోనస్ ను సైతం అందిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట కళాశాలలో ఆధునిక మౌలిక వసతుల కల్పనకు పూర్తి బాధ్యత తనదేనని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ మాట్లాడుతూ తనది ఒక రైతు కుటుంబం అని అన్నారు. 1989లో గొప్ప సంకల్పంతో ఈ వ్యవసాయ కళాశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాటు చేశారన్నారు. 35 ఏళ్లుగా ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను తయారు చేసిందని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో పామాయిల్ రిఫైనరీ, వ్యవసాయ రీసెర్చ్ సెంటర్, ములకలపల్లి మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కోరారు. ఈ సందర్భంగా చెట్ల ప్రాముఖ్యత తెలిపే పాటను పాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జె. సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి, డీఎస్పీ సతీష్ కుమార్, ఐఐఓపీఆర్ ప్రధాన శాస్త్రవేత్త లు ఎం.వీ ప్రసాద్, కె.రామచంద్రుడు, సుజయ్ బయోటిక్స్ ఎండీ లక్ష్మీ ప్రసాద్, రవి హైబ్రీడ్స్ ఎండీ ఎం.రవి, వైరా వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె.రుక్మిణి దేవి, వైరా కేవీకే శాస్త్రవేత్త రవి, కొత్తగూడెం కేవీకే శాస్త్రవేత్త లక్ష్మినారాయణ, ఆలపాటి రామచంద్ర ప్రసాద్, బండి భాస్కర్, మొగళ్లపు చెన్నకేశవరావు, చల్లగుండ్ల నరసింహారావు, గురునాథరెడ్డి, విలేకరి పాశం రామారావు, అలుమిని అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ, విద్యార్థులు హరీష్, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.