'ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర.. ముసాయిదాను వెనక్కి తీసుకోండి'

by Disha Web Desk 13 |
ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర.. ముసాయిదాను వెనక్కి తీసుకోండి
X

దిశ, టేకులపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే విధంగా తీసుకువచ్చిన నూతన అటవీ విధాన ముసాయిదా 2002 ను వెనక్కి తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సమావేశం ముక్తి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కామ్రేడ్ వి. కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో, 10 కోట్ల మంది ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 40 కోట్ల మంది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ముసాయిదాను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిట్టనిలువునా కార్పొరేట్ పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు అమ్మి వేస్తున్నారన్నారు. విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చి రైతాంగం పై, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడానికి ప్రయత్నిస్తుందన్నారు.

అటవీ సంపదను దోచుకుపోవడానికి ఆదివాసీలపై కుట్రపూరితంగా అటవీ విధాన ముసాయిదా 2002 పేరుతో భారతదేశంలోని అడవులను అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని, దీనికి వ్యతిరేకంగా దేశంలోని కలిసివచ్చే సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలతో ఐక్య కార్యాచరణ రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దీని రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ముక్తి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె ఉమర్, తుపాకుల నాగేశ్వరరావు, మోరా రవి, జక్కుల రాంబాబు, బత్తిని సత్యం, పూనేం రంగయ్య, గొగ్గల రాజు, బి. సారయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story