ఎంపీపీ వర్సెస్ వైస్ ఎంపీపీ..

by Sumithra |
ఎంపీపీ వర్సెస్ వైస్ ఎంపీపీ..
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ - వైస్ఎంపీపీల మధ్య ప్రోటోకాల్ వివాదం భగ్గుమంది. వివరాల్లోకెళ్తే మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో త్రాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత.. ఈ సమావేశంపై తనకు ముందస్తు సమాచారం ఎందుకు తెలపలేదని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తిని, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర నిలదీశాడు. ఆహ్వానించడానికి తనకి ఏం సంబంధమని ఎంపీడీవోని అడగాలని ఎంపీపీ బదులిచ్చారు.

ఎంపీపీ అయ్యుండి అందులోనూ ఒకేపార్టీ వాళ్ళమై ఉండి బాధ్యత లేదని ఎలా సమాధానం చెప్తారని.. మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరైన సమావేశానికి తనకి మాత్రమే సమాచారం ఇవ్వరెందుకని వైస్ఎంపీపీ ప్రశ్నించాడు. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అవసరం తనకి లేదని ఎంపీపీ మరోమారు స్పష్టం చేశారు. దీంతో వైస్ఎంపీపీ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీడీవో కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు తనని దూరంగా ఉంచేందుకు.. సమాచారం తొక్కిపడుతున్నారని తీవ్రఆరోపణలకు దిగాడు. పరుష పదజాలంతో ఎంపీపీ పై విమర్శలు చేశారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరినీ సముదాయించి అక్కడ నుంచి పంపించి వేయడంతో వాగ్వాదానికి పుల్ స్టాప్ పడింది.

జూపల్లి అనుచరుడు కావడమే కారణమా..?

అశ్వారావుపేట రాజకీయ ప్రముఖుడు బీఆర్ఎస్ పార్టీ ధిక్కారనేత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు జూపల్లి రమేష్ తో ఎంపీపీ జల్లిపల్లి శ్రీ రామ్మూర్తి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి.. ఎంపీపీ పదవి రావడంలో కూడా జూపల్లి రమేష్ కీలక పాత్ర వహించారు. ఇటీవల జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలలో జూపల్లి రమేష్ పొంగిలేటి వెంటే ఉండగా.. ఎంపీపీ మాత్రం బీఆర్ఎస్ ను వీడేదిలేదని స్పష్టం చేసి పార్టీ కార్యక్రమాలలో ముఖ్యభూమిక వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీపీ పై కుట్ర జరిగి ఉండొచ్చని స్థానికంగా చర్చజరుగుతుంది. అయితే ఎంపీపీ, వైస్ఎంపీపీ ల మధ్య గతంలో కూడా ఇదే విధంగా ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

ఎంపీపీ ది ఒంటెద్దు పోకడ : వైస్ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర

ఎంపీపీ సమక్షంలో జరిగే కార్యక్రమాల్లో వైస్ఎంపీపీ నైన నాకు కుర్చీ లేకుండా చేస్తున్నారు. పంచాయతీరాజ్ నిధులు, అభివృద్ధి పనుల వివరాలు తెలియనివ్వరు.. ఎంపీపీ ఒంటెద్దు పోకడే ఇందుకు కారణం..! అన్ని తానే మిగతా ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఎంపీటీసీలను నిర్లక్ష్యం చేస్తున్న విషయంలో గతంలో కూడా పార్టీ పెద్దలు పద్ధతి మార్చుకోవాలని చెప్పిన ఎటువంటి మార్పు లేదు. ఈరోజు కూడా నన్నుఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఏకవచనంతో మాట్లాడటంవల్లే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

మంచితనాన్ని అలుసుగా తీసుకొని : ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి

సంబంధం లేని ప్రోటోకాల్ వివాదంలోకి నన్ను లాగడం విచారకరం. గతంలో కూడా సదరు వైస్ఎంపీపీ ఇలానే కారణం లేకుండా ఇలానే రాద్ధాంతం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అతని పద్ధతి ఇంతేనేమో అని నేను పట్టించుకోలేదు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని దూషణలకు ఎంతవరకు సమంజసం..! నాపై జరిగిన మాటల దాడిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను. నాకంటే వయసులో చిన్న వారిని కూడా గౌరవంగా పిలిచే వ్యక్తిని నేను.. ఇతరులను ఏదో తక్కువ చేయాలనేది నా మనస్తత్వానికి విరుద్ధం. ప్రోటోకాల్ విషయంలో అవగాహన లేకుండా నాపై నిందలు వేయడం నాకు అర్థం కావడంలేదు అన్నారు.



Next Story

Most Viewed