వైరా తహశీల్దార్ కార్యాలయంలో వన్ మ్యాన్ షో

by Disha Web Desk 12 |
వైరా తహశీల్దార్ కార్యాలయంలో వన్ మ్యాన్ షో
X

దిశ, వైరా: వైరా తాసిల్దార్ కార్యాలయంలో ఓ అధికారి వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు. సదరు అధికారి షాడో తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యాలయంలో అన్ని తానై దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా ఆ అధికారి అందిన కాడికి దండుకుంటున్నారని.. రెవెన్యూ వర్గాలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాలు మొదలు కళ్యాణ లక్ష్మి పథకం వరకు కప్పం కట్టనిదే పనులు చేయని పరిస్థితి నెలకొంది.

అంతే కాదండోయ్.. సదరు అధికారి ధ్రువీకరణ పత్రాల, కళ్యాణ్ లక్ష్మి పథకం దరఖాస్తుల విచారణ కోసం సామాజిక వర్గాల ప్రకారం నగదు డిమాండ్ చేస్తుండటం విశేషం. ఓసి సామాజిక వర్గానికి ఒక రేటు, బీసీ సామాజిక వర్గానికి మరో రేటు, ఇతర సామాజిక వర్గాలకు ఇంకో రేటు ఆ అధికారి ప్రత్యేకత.

రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న అసైన్ భూముల పరిహారంలో కూడా ఆ అధికారి చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వినవస్తున్నాయి. గ్రామాల్లోని వీఆర్ఏల ద్వారా దరఖాస్తుల విచారణ చేయకుండానే కాసులకు కక్కుర్తి పడి అర్హులైన వారితో పాటు అనర్హులకు అవసరమైన ధ్రువ పత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఆ అధికారి పై బలంగా ఉన్నాయి. ఈ కార్యాలయంలో ఉన్నతాధికారి చూసి చూడనట్లు ఆ అధికారిని వదిలేయడంతో ఆయన ఆగడాలు మరింత శృతిమించుతున్నాయని తహశీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

ఇది ఆ అధికారి వన్ మెన్ షో కథ..

తహశీల్దార్ కార్యాలయంలోని జరిగే అన్ని పనుల్లో ఆ అధికారి వన్ మ్యాన్ షో చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దీంతో ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఇతర ప్రభుత్వం పథకాల పనులను గిర్దావర్లే చూసుకుంటున్నారు. అయితే గ్రామాల్లో వీఆర్ఏ వ్యవస్థ ఉంది. కానీ వైరా మండలంలో రెండు గిర్దావర్ పోస్టులుండగా ఒక గిర్దావర్ పనిచేస్తున్నారు.

మరో గిర్దావర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో వైరా మండలాన్ని మొత్తాన్ని తన చేతిలో పెట్టుకున్న ఆ అధికారి ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. ప్రధానంగా రైతుల పొలాలకు సంబంధించి ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సదరు అధికారి వేలాది రూపాయల డిమాండ్ చేస్తున్నారు.

కుల, ఆదాయ, ఈ బీసీ, రెసిడెన్షియల్, తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం లబ్ధిదారులు ఆ అధికారి చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తు విచారణకు ఓసి వర్గం వారైతే రూ.5000 నుంచి 10000, బీసీ వర్గమైతే రూ.5000 నుంచి 8000, ఇతర వర్గాల వారైతే రూ. 3000 నుంచి 5000 ఆ అధికారికి చెల్లించాల్సిందే.

మండలంలోని వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టిన ఆ అధికారి నేరుగా దరఖాస్తుదారులతో మాట్లాడుకుని ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తున్నారు. ఆ అధికారికి కాసులు ఇస్తే ధనవంతులు కూడా ఒక్క రోజులోనే ధ్రువీకరణ పత్రాలు మంజూరు అవుతాయి.

అన్ని సక్రమంగా ఉండి అర్హులైన వారికి ఆ అధికారి ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం విచారణ పేరుతో తీవ్ర కాలయాపన చేస్తుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. "దొర" పేరుతో ఇక్కడ పనిచేస్తున్న ఆ అధికారి తహసీల్దార్ కార్యాలయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని షాడో తహశీల్దార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా వైరా తాసిల్దార్ ఆ అధికారి అవినీతిపై కనీస దృష్టి సారించకపోవడం విశేషం. సదరు అధికారి అక్రమ వసూళ్లకు గురైన అనేక మంది బాధితులు తమ మనోవ్యధను దిశకు తెలిపారు.

భూమికి నష్టపరిహారం లో కూడా చేతివాటం

వైరా మండలంలోని పలు గ్రామాల్లో నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది. ఈ హైవే నిర్మాణానికి రైతుల నుంచి ప్రభుత్వం భూమి సేకరించింది. అయితే ఈ భూముల్లో అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం ముందుగా అసైన్ ల్యాండ్స్‌కు పరిహారం ఇవ్వనని తేల్చి చెప్పింది. అనంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అసైన్డ్ ల్యాండ్స్ కు పరిహారం అందించింది.

అయితే తమ విచారణ తోనే అసైన్మెంట్ ల్యాండ్స్‌కు ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం వచ్చిందని సదరు అధికార బిల్డప్ ఇచ్చారు. అంతేకాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్‌కు పరిహారం లభించిన నిరుపేద లబ్ధిదారుల నుంచి ఉన్నతాధికారుల పేరు చెప్పి భారీ స్థాయిలో నగదు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సోమవారం గ్రామంలో రైతులు సంబంధించిన భూములకు నష్టపరిహారం మంజూరు అయింది. అయితే ఆ రైతులను కూడా సదరు అధికారి ఓ మధ్యవర్తి ద్వారా నగదును డిమాండ్ చేశారు. ఎకరం కోటి రూపాయలకు అమ్ముకోవాల్సిన భూములను ప్రభుత్వానికి కేవలం రూ.20 లక్షల రూపాయలకే ఇచ్చామని, ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చి ఇవ్వాలని ఆ రైతులు సీరియస్ అయ్యారు.

దీంతో సదరు అధికారి సైలెంట్ అయ్యారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వైరా తాసిల్దార్ కార్యాలయంలో ప్రజలను జలగలా పట్టిపీడిస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed