ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

by Sridhar Babu |
ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
X

దిశ, వైరా : చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల క్రితం హైద్రాబాద్​ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తెలిసిందే. అదే విధంగా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 16 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటన మరవకముందే ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన శనివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బీసీ కాలనీలో చోటుచేసుకుంది. ముదిగొండ కృష్ణకౌశిక్ అనే ఐదేళ్ల బాలుడు పాఠశాలకు వెళ్లి వచ్చి సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి.

దీంతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వీధి కుక్కలను తరిమిగొట్టారు. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన వైరాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కుక్కల దాడిలో బాలుడికి చిన్నపాటి గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించే చర్యలు తీసుకొని చిన్నారులతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.



Next Story